కాంగ్రెస్‌ ఖిల్లా.. వరంగల్‌ జిల్లా | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఖిల్లా.. వరంగల్‌ జిల్లా

Aug 26 2025 8:43 PM | Updated on Aug 26 2025 8:43 PM

కాంగ్రెస్‌ ఖిల్లా.. వరంగల్‌ జిల్లా

కాంగ్రెస్‌ ఖిల్లా.. వరంగల్‌ జిల్లా

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలిచి ఇక్కడే విజయోత్సవ సభ

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలిచి ఇక్కడే విజయోత్సవ సభ

చెప్పి మరీ వర్ధన్నపేట, పాలకుర్తి ఎమ్మెల్యే సీట్లు గెలిచాం

జనహిత పాదయాత్రలో

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌

సాక్షి, వరంగల్‌: కాంగ్రెస్‌ ఖిల్లా.. వరంగల్‌ జిల్లా అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. ఆనాడు అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు జరిగిన పాదయాత్రలో వర్ధన్నపేట శాసనసభ్యుడు అరూరి రమేష్‌, గొప్ప నాయకుడు అని చెప్పుకునే ఎర్రబెల్లి దయాకర్‌ రావును ఓడిస్తామని చెప్పి మరీ ఆ సీట్లు కై వసం చేసుకున్నామన్నారు. జనహిత పాదయాత్రలో భాగంగా రాష్ట్ర పార్టీ వ్యవహరాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌తో కలిసి వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం నుంచి వర్ధన్నపేట టౌన్‌ అంబేడ్కర్‌ సెంటర్‌ వరకు సోమవారం రాత్రి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్‌ సెంటర్‌లో జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. వరంగల్‌ జిల్లా అంటేనే రాజకీయాలకు అడ్డా అన్నారు. మరో మూడేళ్లు పాలన ప్రజలతో శభాష్‌ అనిపించుకొని 100 సీట్లతో అధికారంలోకి వచ్చాక ఇదే వర్ధన్నపేటలో విజయోత్సవ సభ చేస్తామని అన్నారు. మాజీ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ...‘ఓటు చోరీ బీజేపీ... ల్యాండ్‌ చోరీ బీఆర్‌ఎస్‌ పార్టీలను బ్యాలెట్‌ మీద బొంద పెట్టాలి. ఆ రెండు పార్టీలను రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పాతాళం లోతుకి పాతి పెట్టాలి. యూరియా మీద రెండు పార్టీలు దొంగ రాజకీయం చేస్తున్నాయి’ అని మండిపడ్డారు. ఎంపీ బలరాం నాయక్‌, ఎమ్మెల్యేలు కేఆర్‌ నాగరాజు, రాజేందర్‌ రెడ్డి, రాంచందర్‌ నాయక్‌, మురళీ నాయక్‌, గండ్ర సత్యనారాయణరావు, యశస్వనిరెడ్డిలు బీఆర్‌ఎస్‌, బీజేపీలపై దుమ్మెత్తిపోశారు. యూరియా విషయంలో కావాలనే కాంగ్రెస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌ బద్నాం చేస్తోందన్నారు. యాత్రలో వేం నరేందర్‌ రెడ్డి, కొండా మురళీ, జంగా రాఘవరెడ్డి, ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. కాగా, మంత్రి సీతక్క, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్‌ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరి ఈ యాత్రకు హాజరుకాకపోవడంపై కార్యకర్తలు చర్చించుకోవడం కనిపించింది. పార్టీ ఫిరాయించారంటూ ఎమ్మెల్యేలకు స్పీకర్‌ నోటీసులిచ్చిన వారిలో ఉన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి అందుకే దూరంగా ఉండొచ్చనే గుసగుసలు వినిపించాయి.

పాదయాత్రకు తరలొచ్చిన శ్రేణులు..

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ రెండో విడత జనహిత పాదయాత్రకు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ శ్రేణులు భారీ సంఖ్యలో తరలిరావడంతో వర్ధన్నపేట మండలంలో కోలాహలం కనిపించింది. కాంగ్రెస్‌ నేతలు రాత్రి ఏడు గంటల ఐదు నిమిషా లకు ఇల్లంద చేరుకోగా ఆటపాటలతో కళాకారులు, బోనాలతో మహిళలు ఘనస్వాగతం పలికారు. వీరిరాకకు ముందే ఇల్లందలో కాంగ్రెస్‌ పార్టీ జెండా ను జిల్లా పార్టీ అధ్యక్షురాలు స్వర్ణ ఆవిష్కరించారు. అనంతరం 7.05 గంటలకు భారీ సంఖ్య లో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో కలిసి నేతలు దాదాపు మూడు కిలోమీటర్లు మేర పాదయాత్ర సాగించారు. సుమారు 8.24 గంటలకు వర్ధన్నపేట టౌన్‌లోని అంబేడ్కర్‌ సర్కిల్‌ చేరుకున్నారు.

తప్పని తిప్పలు...

● ఇల్లంద నుంచి వర్ధన్నపేట వరకు జనహిత పాదయాత్ర ఉండడంతో పోలీసులు ట్రాఫిక్‌ని కట్రియాల నుంచి కొత్తపల్లి రోడ్డుకి డైవర్ట్‌ చేయగా భారీ ట్రాఫిక్‌ జామైంది. అంబులెన్స్‌ వాహనం కూడా ఆ ట్రాఫిక్‌లో చిక్కుకుంది.

● పాదయాత్ర జరిగే జాతీయ రహదారిలో గుంతలు పూడ్చకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు నడిచే సమయంలో ఇబ్బంది పడ్డారు. కొందరు అదుపుతప్పి కిందపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement