భార్యను చంపిన భర్త
రామన్నపేట : మరో పెళ్లికి అడ్డుగా ఉందనే కారణంతో భర్త.. భార్యను చంపాడు. నిద్రిస్తున్న సమయంలో ఆమె ముఖంపై బెడ్‌షీట్ కప్పి ఊపిరాడకకుండా చేసి కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన వరంగల్ మట్టెవాడ పీఎస్ పరిధిలోని హంటర్ రోడ్డులో ఆదివారం చోటుచేసుకోగా, ఘటన జరిగిన 24 గంటల్లోనే పోలీసులు ఛేదించి నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు వివరాలను వరంగల్ ఏఎస్పీ శుభం నాగ్రాలే వెల్లడించారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం దిర్శనపల్లి గ్రామానికి చెందిన బాదావత్ అశోక్ కూతురు గౌతమి(22)కి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బాల్య తండాకు చెందిన బానోత్ గణేశ్‌తో ఈ ఏడాది మేలో వివాహం జరిగింది. గణేశ్‌కు కట్నకానుకల కింద రూ.2.5 లక్షల నగదు, రెండు తులాల బంగారంతోపాటు 150 గజాల స్థలాన్ని త్వరలోనే ఇస్తామని హామీ ఇచ్చి వివాహం జరిపించారు. గణేశ్ ఆటో నడుపుకుంటూ హంటర్ రోడ్డులోని పద్మావతి ఫంక్షన్ హాల్ సమీపంలో అద్దెకుంటున్నాడు. పెళ్లి అనంతరం నెల రోజుల వరకు బాగానే ఉన్న గణేశ్.. ఆటో నడుపుకోవడానికి అదనపు కట్నం కావాలని భార్య గౌతమిని వేధించసాగాడు. దీంతో గౌతమి తండ్రి అశోక్ రూ.లక్ష ఇవ్వగా గణేశ్ ఆ డబ్బుతో ఆటో కొనుగోలు చేశాడు. ఆటో నడుపగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. ఈ క్రమంలో మరోసారి డబ్బులు సరిపోవడం లేదంటూ గౌతమిని ఇబ్బందులకు గురిచేయడంతో మళ్లీ రూ.లక్ష ఇవ్వగా ఆ డబ్బులతో మేకలు కొనుగోలు చేసి స్వ గ్రామంలో తండ్రికి అప్పగించాడు. అప్పటి కూడా భార్యతో సక్రమంగా ఉండడం లేదు. ఈ క్రమంలో తనతో కలిసి పదో తరగతి చదువుకున్న అంజలి అనే యువతితో పరిచయం పెరిగింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించి తనకు అడ్డుగా ఉన్న భార్య గౌతమిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి భార్య నిద్రిస్తున్న క్రమంలో ఆమె ముఖంపై బెడ్‌షీట్ బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపాడు. అనంతరం ఏమీ తెలియనట్లు నటిస్తూ గౌతమి పిలిచినా పలకడం లేదని తన ఇంటి పక్కన ఉంటున్న పెద్దమ్మ కొడుకు కుమార్‌కు చెప్పాడు. కుమార్ దంపతులు వచ్చి చూసి గౌతమిని 108లో ఎంజీఎం తరలించారు. పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటన తర్వాత నిందితుడు తప్పించుకుని తిరుగుతున్న క్రమంలో సోమవారం వరంగల్ చౌరస్తా వద్ద పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు 24 గంటల్లో కేసు ఛేదించిన మట్టెవాడ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్, ఎస్సై శివకృష్ణ, సిబ్బంది ఏఎస్పీ అభనందించారు.
నిందితుడి అరెస్ట్
వివరాలు వెల్లడించిన
వరంగల్ ఏఎస్పీ శుభం నాగ్రాలే