
సెల్‌ఫోన్ చోరీ చేసిన ఇద్దరి అరెస్ట్..
● నిందితుల్లో కానిస్టేబుల్
డోర్నకల్: రైలులో సెల్‌ఫోన్ చోరీ చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఖమ్మం జీఆర్పీ సీఐ ఎన్. అంజలి, డోర్నకల్ ఎస్సై సురేశ్ తెలిపారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 23న హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతానికి చెందిన బండి ప్రియాంక సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ వెళ్తోంది. ఈ క్రమంలో రైలు డోర్నకల్ చేరుకుంటున్న సమయంలో తన ఐఫోన్ చోరీకి గురి కావడంతో డోర్నకల్ జీఆర్పీ స్టేషన్‌లో అదే రోజు ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇందులో రాచకొండ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబు ల్ యరవండి రవీందర్‌తోపాటు అతడి బావమరిది మేకల నాగసాయిగా గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితులు జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు.
మనస్తాపంతో
వ్యక్తి ఆత్మహత్య
● పెద్దతండాలో ఘటన
సంగెం: వ్యవసాయ పనులకు వెళ్లే విషయంలో దంపతుల మధ్య తలెత్తిన ఘర్షణతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సంగెం మండలం పెద్దతండాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన గుగులోత్ రవి(45), వినోద దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ పనులకు వెళ్లే విషయంలో ఆదివారం ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. దీనిపై మనస్తాపం చెందిన రవి.. సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన భార్య వినోద 108లో హుటాహుటిన ఎంజీఎం తరలించగా అదే రోజు రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కూతురు మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.
పాము కాటుతో రైతు మృతి
కొత్తగూడ: పాము కాటుతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం మండలంలోని పోలారంలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బానోత్ చక్ర(44) తన పత్తి చేనులో నీరు పారిస్తుండగా పాము కాటు వేసింది. వెంటనే నర్సంపేట ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, ముగ్గురు కుమారులు ఉన్నారు. ప్రభుత్వం మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

సెల్‌ఫోన్ చోరీ చేసిన ఇద్దరి అరెస్ట్..

సెల్‌ఫోన్ చోరీ చేసిన ఇద్దరి అరెస్ట్..