
విద్యార్థి ఆత్మహత్య
బచ్చన్నపేట: తండ్రి మందలించాడని మనస్థాపంతో విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని లింగంపల్లిలో గురువారం రాత్రి జరి గింది. కుటుంబ సభ్యులు, ఎస్సై అబ్దుల్ హమీద్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేడబోయిన నర్సమ్మ–మల్లయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. చిన్న కుమారుడు సాయివర్ధన్ (20) హైదరాబాద్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతున్నాడు. సాయివర్ధన్ సరిగా చదవడంలేదని తండ్రి మల్లయ్య మందలించాడు. దీంతో సాయివర్ధన్ క్షణికావేశంలో తమ బావి వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి
పెద్దవంగర: అనుమానాస్పద స్థితిలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని ఉప్పరగూడెం గ్రామానికి చెందిన గద్దల బన్నీ (17) తన చిన్నతనంలో తల్లిదండ్రులు మృతి చెందడంతో అమ్మమ్మ గ్రామమైన ఉప్పరగూడెంలో తాత కొమురయ్య సంరక్షణ లో పెరిగాడు. పదో తరగతి పూర్తి కావడంతో ప్రస్తు తం నెల్లికుదరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. రాఖీ పౌర్ణమితోపాటు వరుస సెలవులు రావడంతో అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. శుక్రవారం తాత పొలం పనులకు వెళ్లాడు. అనంతరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై క్రాంతికిరణ్‌ను వివరణ కోరగా ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వర్ధన్నపేట మార్చురీకి తరలించామని, ఫిర్యాదు అందితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడతామని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదన్నారు.

విద్యార్థి ఆత్మహత్య