
సాంకేతికాభివృద్ధిలో కొత్త ఒరవడి
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్‌లో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి సాంకేతికంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని ప్రాజెక్టు డైరెక్టర్ వంగూరు మోహన్‌రావు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో మోహన్‌రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఏపీటీఎస్–విజిలెన్స్ వారిచే గౌరవ వందనం స్వీకరించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగ అమరులకు కార్యాలయం ఆవరణలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో 18 జిల్లాల్లో 70 లక్షల మంది వినియోగదారులకు 24/7 మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. 2024 సంవత్సరం (ఏప్రిల్ నుంచి జూలై) తో పోల్చుకుంటే 33 కేవీ బ్రేక్ డౌన్స్ 2025 (ఏప్రిల్ నుంచి జూలై) లో 21శాతం, 11 కేవీ బ్రేక్ డౌన్లు 46శాతం తగ్గాయన్నారు. విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ సీఎండీ వరుణ్ రెడ్డి స్వీయ ఆలోచనతో రూ. కోటి బీమా సౌకర్యం కల్పించడం అభినందనీయమన్నారు. పునరుత్పాదక శక్తి జూన్ 30, 2025 నాటికి ఎన్పీడీసీఎల్‌లో 2155.87 మెగావాట్ల సోలార్ ఎనర్జీ జనరేషన్ సామర్థ్యాన్ని సాధించామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వంటేరు తిరుపతి రెడ్డి, మధుసూదన్, చీఫ్ ఇంజనీర్లు అశోక్ కుమార్, తిరుమల్‌రావు, రాజుచౌహాన్, అశోక్, వెంకటరమణ, మాధవరావు, సీజీఎంలు చరణ్ దాస్, రవీంద్రనాథ్, జాయింట్ సెక్రటరి రమేష్, కంపెనీ కార్యదర్శి వెంకటేశం, వరంగల్ ఏపీటీఎస్ సీఐ కిరణ్ పాల్గొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ మోహన్‌రావు