
మద్యం మాటే లేదు..
ఏటూరునాగారం : ఆ రెండు గ్రామాల్లో మద్యం మాటే వినపడదు. పండుగ, ఇతర ఏ శుభకార్యమైనా ఉంటే మండల కేంద్రానికి వెళ్లి మద్యం పుచ్చుకోవాల్సిందే. అంతే తప్పా ఆ గ్రామాలకు తెచ్చుకోవడం.. దాచుకోవడం.. ఇంటి వద్ద పార్టీలు చేసుకోవడం లాంటి పనులకు తావేలేదు. ఆయా గ్రామస్తులు కట్టుమీద నిలబడుతున్నారు. అందుకే ఆయా గ్రామాలు 25 ఏళ్ల నుంచి మద్యపాన నిషేధం అమలు చేస్తూ ఇతర ఊళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. అవే ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కేంద్రానికి కూతవేటు దూరంలోని బూటారం, ఎక్కెల గ్రామాలు. ఈ గ్రామాలు మద్య పాన నిషేధం నూటికి నూరుశాతం అమలు చేస్తున్నారు. 2000 సంవత్సరంలో అప్పటి దివంగత సర్పంచ్ దుబ్బ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఆ గ్రామాల్లోని మహిళలు, యువకులు గుడుంబా, మద్యం ధ్వంసం చేశారు. ఆ రోజు రాసిన తీర్మానాన్ని ఇప్పటికీ అవలంబిస్తున్నారు. ఎన్నికలు వచ్చినా ఆ గ్రామాలకు మద్యం రావాలంటే వెన్నులో వణుకుపుట్టాల్సిందే. 2000, ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచి గ్రామాల్లో ఎవరూ మద్యం తాగడం, విక్రయించడం చేయొద్దని అందరు ప్రతిజ్ఞ చేశారు. ఇప్పటికీ అమలు చేస్తున్నారు.
ఆ గ్రామాల్లో 25 ఏళ్ల నుంచి
మద్యపాన నిషేధం