
ఆ రైతు స్ఫూర్తి ప్రదాత..
● సేంద్రియ సాగులో రాణిస్తున్న వెంకన్న
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలం లక్ష్మీతండా జీపీ పరిధి బూరుకుంట తండాకు చెందిన రైతు ధరావత్ వెంకన్న సేంద్రియ వ్యవసాయం చేస్తూ సహరైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వెంకన్నకు మూడెకరాల భూమి ఉండగా కొన్నేళ్ల క్రితం వరకు కూరగాయలు, వరి, ఇతర పంటలు సాగు చేశారు. కోతుల బెడద కారణంగా కూరగాయలు వేసినప్పుడు నష్టం జరిగింది. గతేడాది నుంచి కేవలం వరి మాత్రమే సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది సేంద్రియ పద్ధతిలో ఎకరంలో పూస బాస్మతి రకం, మిగతా రెండు ఎకరాల్లో మాంగ్యల్య సన్నరకం పంట సాగు చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా సేంద్రియ పద్ధతిలో పలు పంటలు సాగు చేస్తూ వెంకన్న పలు అవార్డులు, రివార్డులు పొందారు. మండల స్థాయి ఉత్తమ రైతు అవార్డు పొందారు. అలాగే, మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా పలుమార్లు సన్మానాలు, ప్రశంస పత్రాలు స్వీకరించారు. మండల స్థాయి ఉత్తమ రైతుల ఎంపికలో రూ .10,116 నగదు పారితోషికం పొందారు. కాగా, వర్మి కంపోస్టు తయారుచేసి సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేస్తున్న వెంకన్నను ఆదర్శంగా తీసుకుని ఇతర రైతులు కూడా అదే పద్ధతిని అవలంబిస్తున్నారు.

ఆ రైతు స్ఫూర్తి ప్రదాత..