
నారాయణపురంలో మద్యం విక్రయిస్తే రూ. లక్ష జరిమానా
బచ్చన్నపేట : మండలంలోని నారాయణపురంలో గ్రామస్తులు సంపూర్ణ మద్యపాన నిషేధం కొనసాగిస్తున్నారు. ఇతర గ్రామాల కంటే భిన్నంగా ఉండాలని నిర్ణయించుకున్న ఆ గ్రామస్తులు.. గ్రామంలో దాదాపు ఏడేళ్ల నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నారు. గతంలో గల్లీకో బెల్టు షాపు ఉండేది. ఫలితంగా చాలా మంది ఉదయమే ‘టీ’కి బదులు మద్యం తాగే వారు. ఎంత చెప్పినా మందుబాబులు వినకపోవడంతో వారి ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుని గ్రామంలో మద్యపానం నిషేధాన్ని అమలు చేయాలని గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తే రూ.లక్ష జరిమానా విధించాలని గ్రామస్తులు, మహిళా సంఘాల సభ్యలు ఒప్పంద పత్రాలు రాసుకున్నారు. ఇందుకు పలు శాఖల అధికారులు కూడా సహకరించడంతో నిషేధం విజయవంతమైంది.