
భారత్ మెరవాలి
● ప్రపంచంలోనే దేశం అగ్రగామిగా నిలుస్తుంది..
● పాలకుల విధానాలు మారాల్సిన అవసరం ఉంది
● అభిప్రాయాలు వ్యక్తం చేసిన ‘నలంద’ విద్యార్థులు
● ‘వందేళ్ల భారత్ ఎలా ఉండాలి’ అనే అంశంపై ‘సాక్షి’ టాక్‌షో
మహబూబాబాద్ అర్బన్: ‘మనది ఎప్పుడూ అభివృద్ధి చెందుతున్న దేశమే. మారుతున్న ఆధునిక టెక్నాలజీని అందుకుని ఇంకా మార్పు రావాలి.. అప్పుడే భారత్ మెరుస్తుంది’ అని విద్యార్థులు అంటున్నారు. నేడు (శుక్రవారం) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘2047కు వంద సంవత్సరాలు పూర్తి చేసుకునే భారత్ ఎలా ఉండాలి’? అనే అంశంపై, ఉచిత పథకాలు, పాలకుల విధానం, విద్యా, వైద్యం, ఆరోగ్య రంగ అంశాలపై మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో గురువారం ‘సాక్షి’ టాక్‌షో నిర్వహించింది. ఇందులో విద్యార్థులు తమ అభిప్రాయాలు వెల్లడించారు.
సమరయోధుల
త్యాగాలతోనే స్వేచ్ఛ
అనేక మంది సమరయోధుల పోరాటాలతోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఇన్నేళ్లు గడిచినా దేశంలో ఎక్కడి ప్రజలు అక్కడే ఉన్నారు. పేదలను పట్టించుకొనే నాథుడే లేడు. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా నేటితరం విద్యార్థులు ఉన్నత చదువులు చదివి దేశానికి తమవంతు సహాయం అందించేలా బాధ్యత తీసుకుంటేనే భవిష్యత్‌లో దేశం ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తుంది.
– జాహ్నవి,
బీకాం, ద్వితీయ సంవత్సరం
కొన్ని పథకాలు తొలగించాలి..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాయి. ఇందులో కొన్ని ప్రజలకు ఉపయోగం లేనివి ఉన్నాయి. వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయి. వాటిని సక్రమంగా పేద, మధ్య తరగతి వారికి, చిరువ్యాపారులకు అందిస్తే దేశం ఆర్థిక పురోగతి సాధిస్తుంది. మిగిలిన నిధులను రైతులకు, పాఠశాలలు, గ్రామాలు, తండాల అభివృద్ధికి ఉపయోగించాలి.
– హర్షవర్ధన్, బీఎస్సీ, ఫస్ట్ ఇయర్
నాయకుల్లో మార్పు రావాలి..
భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా చిన్న దేశాలకు స్వాతంత్య్రం వచ్చి అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నాయి. కానీ, 150 కోట్లకుపైగా జనాభా ఉన్న భారతదేశం మాత్రం అభివృద్ధిలో వెనుకంజలో ఉంది. దీనికి ప్రధాన కారణం రాజకీయ నాయకులు. కొంతమంది ధనార్జనే ధ్యేయంగా ఆస్తులు సంపాదిస్తున్నారు. ముందుగా రాజకీయ నాయకులు మారితేనే దేశం మారుతుంది.
– గోగు రమేశ్, బీకాం మూడో సంవత్సరం

భారత్ మెరవాలి

భారత్ మెరవాలి

భారత్ మెరవాలి