
నకిలీ పాసుపుస్తకాల కలకలం!
● పుస్తకాల ప్రింటింగ్.. బ్యాంకు రుణాలు
● బ్యాంకర్లు సహకరించారనే అనుమానం
● చేతులు మారిన కోట్ల రూపాయలు
● పోలీసుల అదుపులో పలువురు నిందితులు
సాక్షి, మహబూబాబాద్: భూమి పట్టాదారు పాసుపుస్తకాల ద్వారా బ్యాంకులు రైతులకు పంట రుణాలు మంజూరు చేస్తాయి. రైతులు ఆ డబ్బులను పంట పెట్టుబడికి వినియోగించుకుంటారు. అయితే ఇదే అదునుగా పలువురు దళారులు నకిలీ పాసుపుస్తకాలు తయారు చేయించి పలుచోట్ల బ్యాంకర్లను బురిడీ కొట్టించి రుణాలు తీసుకోగా.. మరికొన్ని చోట్ల బ్యాంకర్లతో కుమ్మకై ్క కోట్ల రూపాయలు కాజేసిన సంఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. ఈవిషయంలో ఇప్పటికే పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో కొందరు రైతులను ప్రశ్నించి వివరాలు సేకరించినట్లు తెలిసింది.
పుస్తకాల ముద్రణ..
జిల్లాలోని కురవి, నెల్లికుదురు మండలాలకు చెందిన పలువురు యువకులు తమకు ఉన్న పరిచయాలతో మీసేవ ఇతర ఆన్‌లైన్ సెంటర్ల ద్వారా పాసుపుస్తకాలు, సర్వే నంబర్లు, భూ యజమానుల వివరాలు సేకరించారు. తర్వాత గతంలో నకిలీ పాసుపుస్తకాలు, సర్టిఫికెట్లు తయారు చేసిన ముఠాను ఆశ్రయించి నకిలీ పాసుపుస్తకాలు తయారు చేయించుకున్నట్లు సమాచారం. ఇలా కురవి, డోర్నకల్, నెల్లికుదురు, మరిపెడ, చిన్నగూడూరు మండలాల్లో పలువురు రైతుల నుంచి రూ.10వేల చొప్పున వసూళ్లు చేసి.. నకిలీ పాసుపుస్తకాల్లో భూ విస్తీర్ణం పెంచి ఇచ్చారు. అలాగే అసలు భూమి లేని వారి వారి పేరున బ్యాంకు రుణాలు తీసుకునేందుకు సహకరించినట్లు ప్రచారం. ఇలా వందకుపైగా నకిలీ పాసుపుస్తకాలతో కోట్ల రూపాయలు రుణాల రూపేణా తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ వ్యవహారం పోలీసులకు తెలియడంతో పలువురిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నట్లు తండాల్లో చర్చ జరుగుతోంది.
బ్యాంకుల రుణాలు..
ఒరిజినల్ పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నా కూడా రుణాలు ఇచ్చేందుకు పలువురు బ్యాంకు మేనేజర్లు ఇబ్బందులు పెట్టారనే ఫిర్యాదులు ఉన్నాయి. రుణాలు ఇచ్చేటప్పుడు పాసుపుస్తకం అసలుదా.. నకిలీనా అని పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాతే కొత్త రుణాలు ఇస్తారు. కానీ కొందరు బ్యాంకర్ల నకిలీ పాసుపుస్తకాలను పెట్టుకొని రుణాలు ఇవ్వడం ఏంటనే అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. ఈ విషయంలో పాసుపుస్తకాల ప్రింటింగ్, నకిలీ రైతులు, వీరికి బ్యాంకు రుణాలు ఇప్పి ంచే దళారులు ఇలా అందరి పాత్ర ఉన్నట్లు సమాచారం. నకిలీ పాసుపుస్తకాలతో రుణాలు ఇచ్చేందకు కొందరు బ్యాంకు అధికారులు కూడా చేతి వాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో మానుకోట జిల్లాతో పాటు వరంగల్, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలకు చెందిన వారు ఉన్నట్లు తెలిసింది. కాగా అదుపులోకి తీసుకున్న వారి ద్వారా నకిలీ పాసుపుస్తకాల గుట్టును రట్టుచేసే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంపై పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.

నకిలీ పాసుపుస్తకాల కలకలం!