
రైలు ఎటొస్తుందో..
డోర్నకల్: డోర్నకల్ రైల్వేస్టేషన్‌లో వరంగల్ వైపు వెళ్లే రైళ్లు ఏ ప్లాట్‌ఫాంపైకి వస్తాయో తెలియక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ వైపు వెళ్లే రైళ్లు సహజంగా ఒకటి, రెండో నంబర్ ప్లాట్‌ఫారాలపైకి రావాలి. అయితే రెండు, మూడో నంబర్ ప్లాట్ ప్లాట్‌ఫారాలపైకి రైళ్లు వస్తుండడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది సేపట్లో ఒకటి, రెండో నంబర్ ప్లాట్‌ఫారాలపైకి రావాల్సిన రైలు మూడో నంబర్ ప్లాట్‌ఫాంపైకి వస్తుందని మైక్‌లో అనౌన్స్ చేస్తుండడంతో ఫుట్‌ఓవర్ బ్రిడ్జి మీదుగా పరుగున వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులు ఫుట్‌ఓవర్ బ్రిడ్జి, మెట్లపై కూర్చుని రైలు కోసం ఎదురు చూస్తున్నారు. ఒకటి, రెండో ప్లాట్‌ఫారాలపై నిత్యం గూడ్స్ రైళ్లు నిలిచి ఉండడంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లను మూడో నంబర్ ప్లాట్‌ఫాంపైకి మళ్లిస్తున్నారు. అధికారులు స్పందించి వరంగల్ వైపు వెళ్లే రైళ్లను ఒకటి, రెండో నంబర్ ప్లాట్‌ఫారాల మీదుగా నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

రైలు ఎటొస్తుందో..