ఆదివాసీలు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత విద్య
కేయూ క్యాంపస్: సమాజంలో వివక్ష, అవహేళన, నిరాదరణకు గురవుతున్న ఆదివాసీలు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు ఇక నుంచి ఉన్నత విద్య అనే ఆయుధంతో సగౌరవంగా జీవించగలరు. ఆయా వర్గాల్లో విజ్ఞానం, నైపుణ్యం, ఆత్మవిశ్వాసం పెరిగి స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో తాజాగా సమతా సహాయక పథకాన్ని (సమతా ఫ్రి షిప్స్) ప్రారంభించారు. విద్యను సామాజిక మార్పు, సాధికారతకు అత్యంత శక్తివంతమైన సాధనంగా గుర్తిస్తూ సమతా సహాయక పథకాన్ని చేపట్టారు. ఈ ఉన్నత విద్య డిగ్రీలో తక్కువ ప్రాతినిథ్యం ఉన్న వర్గాలు, ప్రధాన సమూహాలకు ఉచిత విద్యనందించేందుకు నిర్ణయించారు. ఇప్పటికే ఆ యూనివర్సిటీ పాలకమండలి కూడా ఆమోదించింది. ఇందులో ప్రధానంగా ఆదివాసీలు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు ఈ సమతా సహాయక పథకం కింద ఉన్నత విద్య డిగ్రీ చదువుకునేందుకు ఈ విద్యాసంవత్సరం 2025–2026లోనే ఉచిత విద్యనందించబోతుంది. ఈ మేరకు అడ్మిషన్ల ప్రక్రియ, ప్రొఫార్మాలో మార్పులు చేపట్టారు. దీంతో ఆర్థిక సమస్యలు, వివిధ కారణాలతో ఉన్నత విద్యకు దూరమైన ఆయా వర్గాలు చదువుకునే వీలు కలగబోతుంది.
ఆదివాసీల్లో ఈతెగలకు..
ఆదివాసీల్లో ప్రధానంగా తెలంగాణలో ఉన్న చెంచులు, గోండులు, కోయ, గొత్తికోయ, కొండరెడ్లు, నాయక్ పోడ్, పార్దాన్, తౌటి తెగల్లోని యువతకు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉచిత విద్యనదించబోతున్నారు. కేవలం రూ. 500 ఫీజు రిజిస్ట్రేషన్‌తోనే అడ్మిషన్లు కల్పిస్తారు. పుస్తకాలు కూడా అందజేస్తారు. కులం, నివాస ధ్రువీకరణ పత్రాలతోపాటు వార్షిక ఆదాయం (తాజా) రూ. 2 లక్షలలోపు ఉన్న వారికి ఈ పథకం వర్తించనున్నది.
దివ్యాంగులకు..
దివ్యాంగులకు కూడా పథకం వర్తింపజేశారు. 40 శాతం వైకల్యం కలిగిన యువత డిగ్రీలో ప్రవేశాలు పొందొచ్చు. నామినల్ ఫీజు వీరికి కూడా రూ. 500 మాత్రమే. వీరికి గతంనుంచే పరీక్ష ఫీజు కూడా లేదు. నివాస ద్రువీకరణపత్రంతోపాటు వార్షిక ఆదాయం రూ. 6లక్షల లోపు కలిగి ఉన్న వారు కూడా అర్హులే. సదరం సర్టిఫికెట్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
ట్రాన్స్‌జెండర్లకు..
ట్రాన్స్‌జెండర్లు సమాజపు అపహాస్యం, వివక్ష కారణంగా ప్రధాన విద్యావ్యవస్థ నుంచి బయటకు నెట్టివేయబడుతున్నారు. వీరికి కూడా ఉచిత ఉన్నత విద్య అందించేందుకు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అవకాశం కల్పించేందుకు ఉపక్రమించింది. ఈ వ్యవస్థాపరమైన అసమానతలను తగ్గించడమే లక్ష్యంగా సమతా సహాయక పథకాన్ని రూపొందించారు. ట్రాన్స్‌జెండర్లు జెండర్ ధ్రువీకరణపత్రం, ఆదాయం అర్బన్ ప్రాంతంవారికి రూ. 2లక్షల వరకు, గ్రామీణం రూ. లక్షా 50వేల వరకు ఉన్న వారికే ఈపథకం వర్తింపు. వీరు కూడా రూ .500 ఫీజుతో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉచిత విద్యతో నమోదు పెరగనుంది..
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో ఆదివాసీలు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత విద్యను ప్రవేశపెట్టిన నేపథ్యంలో వివిధ కోర్సుల్లో నమోదు పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఈయూనివర్సిటీ పరిధిలో 104 స్టడీ సెంటర్లు ఉన్నాయి. డిగ్రీ, పీజీ డిప్లొమా కలిపి సుమారు 39 కోర్సులు నిర్వహిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 స్టడీసెంటర్లు ఉన్నాయి. సమతా సహాయక పథకం కింద ఆర్థిక, సాంస్కృతిక అడ్డంకులు తొలగి సమానత్వ సమాజం ఏర్పడుతుందని భావిస్తున్నాం. ఆయా వర్గాల్లో విజ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెరిగి స్వయం సమృద్ధి సాధిస్తారు.
– డాక్టర్ వై. వెంకటేశ్వర్లు, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థి సేవావిభాగం డైరెక్టర్
బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో సమతా సహాయక పథకం
డిగ్రీలో ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు..
స్టడీ మెటీరియల్, పాఠ్యపుస్తకాలు ఫ్రీ
సమానత్వపు సమాజం దిశగా..
సమానత్వపు సమాజం దిశగా..