
రామప్ప కీర్తిని చాటేలా..
కాకతీయుల కళావైభవానికి ప్రతీక రామప్ప దేవాలయం. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు రావడంతో రామప్ప కీర్తి మరోసారి మార్మోగింది. 1213 లో కాకతీయులు నిర్మించిన రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడంతో దేశ,విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా పెరిగింది. పర్యాటక ప్రాంతానికి మారుపేరు ములుగు జిల్లా. రామప్ప ఆలయం, లక్నవరం సరస్సు, మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర, తాడ్వాయి హట్స్, ఏటూరునాగారం అభయారణ్యం, మల్లూరు లక్ష్మీనరసింహాస్వామి ఆలయం, బొగత జలపాతంతో పాటు మరికొన్ని జలపాతాలు ములుగు జిల్లాకు ప్రత్యేకం. పర్యాటక జిల్లాగా పేరొందిన ములుగు జిల్లాలోని కూడళ్లను అందంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పలుచోట్ల థీంలు ఏర్పాటు చేస్తుండడంతో కూడళ్లు జిగేల్ మంటున్నాయి.
విద్యుత్ కాంతుల్లో డమరుకం
–వెంకటాపురం(ఎం)
జిల్లాలో రూ.2.61 కోట్లతో పలు కూడళ్లను అభివృద్ధి చేస్తున్నారు. ములుగు మండలం జంగాలపల్లి క్రాస్ వద్ద సుందరీకరణ పనులు చేపట్టి ఆదివారంతో పూర్తి చేశారు. జంగాలపల్లి క్రాస్‌లోని జంక్షన్‌లో రామప్ప ఆలయ విశిష్టత తెలియజేసేలా శివుడి వాహనమైన నందీశ్వరుడిని (నంది విగ్రహాన్ని) ఏర్పాటు చేసి మూడు పక్కల మూడు ఏనుగు విగ్రహాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా శివుడు డమరుకం వాయిస్తున్నట్లు చూపుతూ డమరుకం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రామప్ప ఆలయాన్ని చూపే విధంగా శిలాశాసన మండపం మాదిరి మండపాన్ని నిర్మించారు. మండపం చుట్టూ ఆరుగురి మదనికల శిల్పాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేసి లోపల గ్రాస్‌తో గ్రీనరీ ఏర్పాటు చేసి వివిధ రకాల పూలమొక్కలు నాటారు. గ్రిల్స్‌కు డమరుకం, త్రిశూలం, శివుని మూడో కన్నుతో కూడిన త్రినయనం చిహ్నాలు నిర్మించారు. రాత్రివేళ విద్యుత్ కాంతుల మధ్య నంది విగ్రహం, డమరుకం, మండపం, మదనికల భంగిమలతో కూడిన శిల్పాలు జిగేల్ మంటున్నాయి. నంది విగ్రహంతోపాటు మండపం నుంచి ఫౌంటేన్‌లా నీరు ఎగిసిపడుతుండడంతో ప్రజలు సెల్ఫీలు దిగుతూ సంబురపడిపోతున్నారు. విద్యుత్ వెలుతురులో కాకతీయ కళావైభవం ఉట్టిపడేలా జంగాలపల్లి కూడలి మెరిసిపోతోంది.
రామప్ప ఆలయ విశిష్టత తెలియజేసేలా..
కాకతీయ కళావైభవంతో మెరిసిపోతున్న జంగాలపల్లి కూడలి
రూ.2.61 కోట్లతో పూర్తయిన
సుందరీకరణ పనులు
విద్యుత్ వెలుగుల్లో నంది విగ్రహం,
డమరుకం, శిలాశాసన మండపం