
కబ్జా చేశాడు.. అద్దెకిచ్చేశాడు!
హసన్‌పర్తి: ఓ అక్రమార్కుడు దర్జాగా ఎస్సారెస్పీ భూములు ఆక్రమించాడు. అంతటితో ఆగలేదు. ఆ భూమిని అద్దెకు ఇచ్చినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల సహకారంతోనే ఈ వ్యవహారం సాగుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు రూ.10కోట్ల మేరకు భూమి స్వాహా చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిలోని చింతగట్టు క్యాంపులోని నీటి పారుదలశాఖ ప్రధాన కార్యాలయం సమీపంలో సుమారు రెండెకరాల ఎస్సారెస్పీ భూమి ఉంది. అయితే ఈ స్థలాన్ని మూడేళ్లుగా ఓ అక్రమార్కుడు కబ్జా చేశాడు.
దర్జాగా ఇసుక లారీల పార్కింగ్..
ఈ భూమిలో దర్జాగా ఇసుక లారీల పార్కింగ్ నిర్వహిస్తున్నారు. నెలకు ఒక్కొక్క లారీ యజమాని నుంచి కొంతమొత్తంలో అద్దె డబ్బులు వసూలు చేస్తున్నట్లు స్థానికంగా చెబుతున్నారు. ఈ మాముళ్లల్లో అధికారులకు కూడా భాగస్వామ్యం ఉన్నట్లు స్థా నికులు ఆరోపిస్తున్నారు. మూడేళ్లుగా ఇక్కడ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అలాగే, ఈ భూమి లో ఓ డబ్బా కూడా ఏర్పాటు చేశాడు. ఆ డబ్బాల ను కూడా అద్దెకిచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా..
ఇసుక లారీల పార్కింగ్ అసాంఘిక కార్యకలాపాల కు అడ్డాగా మారింది. ఫలితంగా ఇటు వైపు రాకపోకలు సాగించాలంటే మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారు. లారీ డ్రైవర్లు మద్యం సేవిస్తూ న్యూసె న్స్ చేస్తున్నారని, దీంతో రాత్రి వేళ ఈ మార్గం నుంచి వెళ్లాలంటే భయమేస్తోందని స్థానికులు తెలిపా రు. కాగా, కాలనీవాసుల ఇటీవల సమావేశం ఏ ర్పాటుచేసి లారీల పార్కింగ్ తొలగించకపోతే ఆందోళన చేపడుతామని హెచ్చరించినట్లు తెలిసింది.
చర్యలు తీసుకుంటాం
కబ్జాదారుడిపై చర్యలు తీసుకుంటాం. ఇక్కడ నుంచి లారీల అడ్డాను తొలగిస్తాం. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాం
–రాజు, డీఈఈ, నీటిపారుదలశాఖ
రూ.10 కోట్ల భూమి స్వాహా
దర్జాగా ఇసుక లారీల పార్కింగ్
అక్రమార్కుడిపై ఫిర్యాదు చేసినా
స్పందించని అధికారులు