
బొగతలో పర్యాటకుల సందడి..
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి సమీపంలో ఉన్న బొగత జలపాతం వద్ద పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం సెలవుదిన కావడంతో భారీ సంఖ్యలో తరలొచ్చారు. ఈ సందర్భంగా జలపాతం జలధారలను వీక్షించడంతోపాటు సెల్ ఫోన్లలో బంధించారు. కొలనులో స్నానాలు చేస్తూ సెల్ఫీలు, ఫొటోలు దిగి సందడి చేశారు. ప్రకృతి అందాలకు ఫిదా అయ్యారు. నడిచి వెళ్లలేని పర్యాటకుల కోసం రైడర్ వాహనం ఏర్పాటు చేసి జలపాతం వద్దకు తరలించారు.
గుర్తుతెలియని వాహనం ఢీ..
ఐనవోలు: గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం సాయంత్రం మండలంలోని కక్కిరాలపల్లి క్రాస్ సమీపం వరంగల్–ఖమ్మం రహదారిపై చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పున్నేలు గ్రామానికి చెందిన చాట్ల నవీన్, వరుసకు బావ మరుదులైన ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి గ్రామానికి చెందిన జక్కుల సన్నీ, జక్కుల బన్నీ వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో పెళ్లి వేడుకకు హాజరయ్యారు.
అనంతరం నవీన్ ద్విచక్ర వాహనంపై బావమరదులు సన్నీ, బన్నీలతో కలిసి పున్నేలుకు బయలుదేరాడు. ఈ క్రమంలో కక్కిరాలపల్లి క్రాస్ సమీపంలో వరంగల్–ఖమ్మం రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీ కొనగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అటువైపు వెళ్తున్న ప్ర యాణికులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించారు. అయితే ప్రమాదం జరిగి గంటదాటినా ఘటనా స్థలికి 108 వాహనం రాకపోవడంపై పలువురు మండిపడ్డారు. తీవ్ర గాయాలైన ఒకరిని ముందు ఆటోలో తరలించగా మరో ఇద్దరిని 108లో ఆస్పత్రికి తరలించారు.