
పాల సేకరణ
బిల్లుల చెల్లింపులో జాప్యం
పాడి రెతు నుంచి పాలు సేకరించిన తర్వాత 15 రోజుల్లో బిల్లులు చెల్లించాలి. కానీ నెలరోజుల తర్వాత చెల్లిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లుల ఆలస్యంతో పాడి రైతులు కేంద్రాల్లో విక్రయించకుండా హోటళ్లు, స్వీట్ హౌస్‌లు, గ్రామాల్లో విక్రయిస్తున్నారు.
మహబూబాబాద్: పాల ఉత్పత్తి పెంపుపై ప్రభుత్వం పెద్దగా ఆశక్తి చూపడం లేదు. దీంతో పాల శీతలీకరణ కేంద్రాల పరిస్థితి మరీ ఆధ్వానంగా తయారైంది. పాల బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం, ఆధునాతన మిషనరీలు అందుబాటులో లేకపోవడం, తదితర కారణాలతో జిల్లాలో పాల సేకరణ ఏటేటా తగ్గుతూ వస్తోంది. అలాగే నల్లజాతి పశువుల సంఖ్య తగ్గడం కూడా పాల సేకరణపై ప్రభావం చూపుతోంది. నల్ల జాతి పశువుల పోషణకు ఖర్చు ఎక్కువ కావడంతో పాటు పనిభారం ఉండడంతో పాడి రైతులు వాటి పెంపకం విషయంలో ఆసక్తి చూపడం లేదు.
మానుకోటలో..
జిల్లా కేంద్రంలో 2003లో పాలశీతలీకరణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ కేంద్రంలో మేనేజర్, సూపర్‌వైజర్, వర్కరు పని చేస్తున్నారు. కేంద్రం పరిధిలో కురవి, మానుకోట, డోర్నకల్, గార్ల, బయ్యారం, గూడూరు, కేసముద్రం మండలాలు ఉన్నాయి. కేంద్రాలకు మూడు ఆటోలు ఉన్నాయి. ఒకటి బయ్యారం రూట్, రెండోది డోర్నకల్, మూడోది గూడూరు రూట్‌లో పాల సేకరణతో పాటు ఆయా రూట్లలో ఉన్న ప్రభుత్వ హాస్టళ్లకు విజయ పాల ప్యాకెట్లు సరఫరా చేస్తున్నారు.
తొర్రూరులో..
తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో పాలశీతలీకరణ కేంద్రం ఉంది. మేనేజర్, సూపర్‌వైజర్‌తో పాటు ముగ్గురు వర్కర్లు పని చేస్తున్నారు. ఆ కేంద్రం పరిధిలో పాలకుర్తి, కొడకండ్ల, పెద్దవంగర, తొర్రూరు, రాయపర్తి, దంతాలపల్లి, నెల్లికుదురు, నర్సింహులపేట, మరిపెడ, సూర్యాపేట జిల్లాలోని నూతనకల్లు మండలాలు ఉన్నాయి. ఆరు ఆటోల ద్వారా పాల సేకరణతో పాటు ప్రభుత్వ హాస్టళ్లకు విజయపాల ప్యాకెట్లు సప్లై చేస్తున్నారు.
పాల సేకరణ తగ్గుదల..
మానుకోట పాల శీతలీకరణ కేంద్రం పరిధిలో సుమారు 800 మంది పాడి రైతులు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 500కు పడిపోయిందని సిబ్బంది తెలిపారు. గతంలో ప్రతీరోజు 1,000 లీటర్ల పాల సేకరణ జరిగితే ప్రస్తుతం 400 లీటర్లు మాత్రమే సేకరిస్తున్నారు. అలాగే తొర్రూరు పాలశీతలీకరణ కేంద్రం పరిధిలో గతంలో 1,800 మంది పాడిరైతులు ఉండగా.. ప్రస్తుతం 1,000 మంది మాత్రమే ఉన్నారని సిబ్బంది పేర్కొన్నారు. గతంలో ప్రతీరోజు 4,800 లీటర్ల సేకరణ జరుగగా.. ప్రస్తుతం 1,000 లీటర్ల పాలు సేకరిస్తున్నారు.
వెన్న శాతాన్ని బట్టి ధర..
ఆవు పాల సేకరణ చాలా తక్కువగా ఉండగా లీటరు రూ.40 నుంచి రూ.46 వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. గేదె పాలు లీటరు రూ.42 నుంచి రూ.85 వరకు కొనుగోలు చేస్తున్నారు. వెన్న శాతాన్ని బట్టి ధర కేటాయిస్తున్నారు.
తగ్గిన నల్లజాతి పశువులు..
ప్రతీ ఐదేళ్లకోసారి పశుగణన జరుగుతుంది. కాగా, గత ఏడాది అక్టోబర్‌లో పశుగణన ప్రారంభించి ఈ ఏడాది ఫిబ్రవరిలో పూర్తి చేశారు. జిల్లాలో ఐదేళ్లక్రితం 11,85,568 పశువులు ఉండగా.. ప్రస్తుతం 8,40,114 పశువులు ఉన్నాయి. వాటిలో నల్లజాతి పశువులే చాలా వరకు తగ్గినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇది పాల ఉత్పత్తిపై చలా ప్రభావం చూపుతోంది.
నిర్వహణ మరీ దారుణం..
మానుకోట పాల శీతలీకరణ కేంద్రం ఆవరణ అంతా పిచ్చి మొక్కలతో దారుణంగా తయారైంది. ఆ కేంద్రం బయట బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. అలాగే జిల్లా కేంద్రానికి దూరంగా ఉండడం, పలు కారణాలతో అక్కడికి వెళ్లి పాలు విక్రయించేందుకు పాడి రైతులు మక్కువ చూపడం లేదు. ప్రభుత్వం పాల ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని, అందుకోసం పాల శీతలీకరణ కేంద్రాలను అభివృద్ధి చేయాలని, మిషనరీలు సరఫరా చేయాలని, బిల్లులు సకాలంలో చెల్లించాలని పాడి రైతులు కోరుతున్నారు.

పాల సేకరణ

పాల సేకరణ

పాల సేకరణ