
విద్యార్థులకు అందని రాగిజావ
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం రాగిజావ పంపిణీకి శ్రీకారం చుట్టింది. జిల్లాలో శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు ఆధ్వర్యంలో రాగి పిండి, బెల్లంతో కలిపి తయారు చేసిన పౌష్టికాహార మిశ్రమాన్ని ప్యాకెట్ల రూపంలో ఆయా ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేశారు. ఉదయం పాఠశాలకు హాజరైన విద్యార్థులు అందించేవారు. ప్రస్తుతం నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి రాగిజావ అమలుపై నీలినీడలు అలుముకున్నాయి.
ఆకలితో అలమటిస్తూ..
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది రక్తహీనతతో బాధపడుతుండడం, ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల చదువుపై ఆ ప్రభావం పడేది. దీనిని దృష్టిలో పెట్టుకుని పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్న గొప్ప సంకల్పంతో శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు స్వచ్ఛందంగా రాగి జావ పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడంపై ఇటు విద్యార్థులు, అటు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కానీ ఈ విద్యాసంవత్సరం పాఠశాలల పునఃప్రారంభం నుంచే పిల్లలకు రాగిజావ అందించడం లేదు. దీంతో విద్యార్థులు ఉదయం పూట తినిరాకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారు.
ఎదుగుదలకు దోహదం..
జిల్లాలో 676 ప్రైమరీ పాఠశాలల్లో 1,9213 మంది విద్యార్థులు చదువుతున్నారు. 120 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 5,354 మంది, 102 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 1,3497 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కో విద్యార్థికి రోజుకు పది గ్రాముల చొప్పున రాగి జావను అందించేవారు. రాగుల్లో వివిధ ఖనిజ పోషక విలువలు కలిగి ఉండడంతో విద్యార్థుల ఎదుగుదలకు దోహదం చేస్తాయి. అటువంటి రాగిజావను విద్యార్థులకు అందించకపోవడంతో చదువులో వెనకబడుతారని, రక్తహీనతతో ఇబ్బందులు, విష జ్వరాలు, డెంగీ వంటి వ్యాధులతో అనారోగ్యం పాలవుతారని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికై నా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి రాగిజావను అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
రాగిజావ అందించాలి..
ఎక్కువ శాతం పిల్లలు ఉదయం పూట ఖాళీ కడుపుతో పాఠశాలకు వస్తుంటారు. గత ప్రభుత్వ ం మాదిరిగానే సర్కారు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రాగిజావ అందించాలి. పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి.
– పట్ల మధు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి
పాఠశాలల పునఃప్రారంభం
నుంచే అమలుపై నీలినీడలు
ఉదయం ఆకలితో
అలమటిస్తున్న పిల్లలు

విద్యార్థులకు అందని రాగిజావ