
వైద్యం వికటించి వ్యక్తి మృతి..
● గోపాల్‌నగర్‌లో ఘటన
● ఆర్‌ఎంపీ కారణమని
కుటుంబీకుల ఆరోపణ
బచ్చన్నపేట: ఆర్‌ఎంపీ వైద్యం వికటించి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మండలంలోని గోపాల్‌నగర్‌లో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గంగరబోయిన భిక్షపతి (45) ఒళ్లు నొప్పులతో స్థానిక ఆర్‌ఎంపీ కృష్ణ వద్దకు వెళ్లగా ఆయన ఇంజక్షన్ చేసి మందులు రాసి ఇచ్చాడు. ఇంటికెళ్లిన భిక్షపతి పడిపోవడంతో కుటుంబ సభ్యులు జనగామలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు.. ఆర్‌ఎంపీ ఇంటిఎదుట ఆందోళన చేపట్టారు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్సై హమీద్ ఘటనాస్థలికి చేరుకుని ఆర్‌ఎంపీ, మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి నచ్చజెప్పారు.