
అమరుల స్ఫూర్తితో పోరాడాలి
ఏటూరునాగారం: అమరుల స్ఫూర్తితో పోరాడాలని గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు దామోదర్, చిరంజీవి అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలోని వై జంక్షన్ నుంచి ఐటీడీఏ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా గిరిజన తెగ ఉనికి ప్రమాదంలో పడుతోందన్నారు. ఈ తరుణంలో గిరిజన హక్కులను కాపాడుకునేందుకు ప్రభుత్వాలు, గిరిజన హక్కుల సంఘాలు చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం నిర్వహించడం లేదని తెలిపారు. రాజ్యాంగంలోని గిరిజన హక్కులను కాపాడుకుందామని, అడవులు, భూముల నుంచి గిరిజనులను గెంటివేయడాన్ని ఆపాలన్నారు. గిరిజనులకు ఇచ్చిన హామీల అమలు కోసం పోరాడుదాం అనే నినాదాలతో ప్రపంచ ఆదివాసీ గిరిజన హక్కుల దినోత్సవాన్ని జరుపుతున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు ఇచ్చిన 16 వాగ్దానాలను వెంటనే అమలు చేసేందుకు కార్యాచరణ ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పూనం నగేశ్, కుర్సం చిరంజీవి, కుర్సం శాంతకుమారి, తోలెం కృష్ణయ్య, సౌలం వీరబాబు, ఆలెం అశోక్, కోరం చిరంజీవి, కుర్సం ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు దామోదర్, చిరంజీవి
ఘనంగా ఆదివాసీ దినోత్సవం