
సాగు అంతంతే!
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ఆశించిన స్థాయిలో రైతులు పంటలు సాగు చేయలేదు. ఈ ఏడాది సరైన సమయంలో వర్షాలు పడకపోవడంతో పంటల సాగు ఆగుతూ.. సాగుతోంది. ప్రధాన పంటలు పత్తి, మొక్కజొన్న సాగు లక్ష్యాన్ని చేరుకోలేదు. అలాగే వర్షాలు కురిసినప్పుడు మాత్రమే వరినాట్లు వేసి.. అనంతరం విరమించుకుంటున్నారు. రెండు రోజులుగా కురిసిన వర్షానికి జిల్లాలో రైతులు వరినాట్లు వేస్తున్నారు.
తగ్గిన పత్తి, మొక్కజొన్న..
జిల్లా వ్యవసాయశాఖ రూపొందించిన వానాకాలం పంటల ప్రణాళిక అంచనాను వర్షాలు తారు మారు చేశాయి.. ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో 4,29,790 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని అంచనా వేశారు. ఇందులో 84,854 ఎకరాల్లో పత్తి, 58,361 ఎకరాల్లో మొక్కజొన్న, 52,249 ఎకరాల్లో మిర్చి సాగు చేసే అవకాశం ఉందని అధికారులు పంట ప్రణాళికలో పేర్కొన్నారు. అయితే ఆశించినస్థాయిలో వర్షాలు పడకపోవడంతో 78,797 ఎకరాల్లో పత్తి, 57,264 ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. అదే విధంగా పెసర 4,555 ఎకరాల్లో అంచనాలో పేర్కొనగా కేవలం 1,724 ఎకరాలకు పరిమితమైంది. ఇలా జిల్లాలో ఇప్పటి వరకు అన్ని పంటలు కలిపి 2,77,345 ఎకరాల్లో మాత్రమే సాగుచేశారు. వరి సాగు చేయగా మిగిలిన భూముల్లో మిర్చి సాగు పెరిగే అవకాశం ఉంది. మిర్చి గతేడాది 52వేల ఎకరాల్లో సాగు చేయగా.. ప్రస్తుతం 60వేల ఎకరాలకు చేరుకోవచ్చు.
ఒకవైపు నిండి.. మరో వైపు ఎండి..
జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురిసి చెరువులు నిండగా... మరికొన్ని చోట్ల కనీస వర్షపాతం కూడా నమోదు కాలేదు. జిల్లాలో 1,590 చెరువు ఉన్నాయి. ఇందులో 175 చెరువుల్లో 25 శాతం నీరు కూడా రాలేదు. ఇందులో తొర్రూరు, పెద్దవంగర, నెల్లికుదురు, మరిపెడ, నర్సింహులపేట, చిన్నగూడూరు మండలాల్లోని చెరువులు ఎక్కువగా ఉన్నాయి. అదే విధంగా 898 చెరువుల్లో 75శాతం నుంచి 100శాతం, 65 చెరువులు మత్తడి పోస్తున్నాయి. వీటిలో కొత్తగూడ, గంగారం, గూడూరు, బయ్యారం, గార్ల, మహబూబాబాద్, కురవి మండలాల్లోని చెరువులు ఉన్నాయి. అంటే జిల్లాలోని సగం చెరువులు నిండి.. సగం చెరువులు ఎండి కనిపిస్తున్నాయి.
నీటి లభ్యత ఆధారంగా
వరి సాగు చేయాలి
వరి సాగుకు సాగునీరు ఎక్కువ అవసరం. నీటి లభ్యత ఆధారంగా వరి నాట్లు వేసుకోవాలి. సన్న రకాలు, స్వల్పకాలిక కాలం రకాలు సాగు చేసుకోవాలి. నారు పోసుకున్నవారు ఆగస్టు చివరి వరకు వరి నాట్లు వేసుకుంటే ఇబ్బంది లేదు. నీరు లేకపోతే ఆరుతడి పంటలు సాగుచేసుకోవడం మేలు. మొక్కజొన్న, జొన్న, పెసర సాగుకు అనువుగా ఉంటుంది.
– క్రాంతి కుమార్, వ్యవసాయ శాస్త్రవేత్త, మల్యాల
జిల్లాలోని చెరువుల్లో నీటి నిల్వల వివరాలు
నీటి శాతం చెరువుల
సంఖ్య
0–25శాతం 175
25–50శాతం 165
50–75శాతం 287
75–100శాతం 898
అలుగులు పోసేవి 65
మొత్తం 1,590
తగ్గిన పత్తి, మొక్కజొన్న పంటలు
ఆగుతూ.. సాగుతున్న వరినాట్లు
మిర్చి విస్తీర్ణం పెరుగుతుందనే నమ్మకం
లోటు వర్షపాతమే కారణం
సాగలేక.. ఆగలేక
జిల్లాలో ప్రధాన పంట అయిన వరి సాగు కాస్త ముందుకు కాస్త వెనక్కి అన్నట్లు మారింది. 2,21,282 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకు 1,38,576 ఎకరాల్లోనే సాగు చేశారు. ఇందులో అత్యధికం బావులు, బోర్లు, ఇతర నీటి వనరులు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. అయితే మరో 1,56,110 ఎకరాల్లో నాట్లు వేసే విధంగా వరి నార్లు పోశారని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెల 15 వరకు వరి నాట్లు వేసుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతుండడం, రెండు రోజుల క్రితం కురిసిన వర్షంతో నాట్లు ముమ్మరం చేశారు. వారంరోజుల్లో మరో 50 వేల ఎకరాల్లో వరినాట్లు పడే అవకాశం ఉంది.

సాగు అంతంతే!

సాగు అంతంతే!

సాగు అంతంతే!