
ఒక సీసీ కెమెరా వందమందితో సమానం
నెల్లికుదురు: ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని తొర్రూర్ డీఎస్పీ కృష్ణకిశోర్ అన్నారు. ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగారం, మీఠ్యతండా పరిధిలో శనివారం నెల్లికుదురు పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈసందర్భంగా అక్రమంగా విక్రయిస్తున్న రూ.20వేల విలువ చేసే మద్యం, 20 లీటర్ల గుడుంబా, 4 క్వింటాళ్ల నల్ల బెల్లం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి, పత్రాలు లేని 22 వాహనాలు, ఆటోను సీజ్ చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. అక్రమ దందాలు, మద్యం, గంజాయి, గుడుంబా మత్తు పదార్థాలకు బానిసై ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్లకు వాహనాలు ఇవ్వడం, ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. కార్యక్రయమంలో తొర్రూరు సీఐ వివిధ మండలాల ఎస్సైలు చిర్ర రమేష్ బాబు, రాజు, సురేష్, క్రాంతి కిరణ్, 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
గేట్ వాల్వ్ లీకేజీ
మహబూబా బాద్: జిల్లా కేంద్రంలోని కంకరబోడ్ ప్రాంతంలోని మెయిన్‌రోడ్డులో తాగునీటి పైపు లైన్‌కు సంబంధించిన గేట్ వాల్వ్ పాడైపోయింది. గేట్ వాల్వ్ లీకేజీతో నీరు రోడ్డుపై వృథాగా ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు గేట్ వాల్వ్‌కు అడ్డుగా రాళ్లు కవర్లు కట్టారు. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.
స్పోకెన్ ఇంగ్లిష్, స్కిల్స్‌పై
శిక్షణ తరగతులు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ (సెల్ట్) ఆధ్వర్యంలో 40 రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.మేఘనరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు తమ పేర్లను ఈనెల 30 వరకు నమోదు చేసుకోవాలని ఆ యూనివర్సిటీ విద్యార్థులకు రూ.200, నాన్ టీచింగ్ ఉద్యోగులకు, మహిళలకు ఇతరులకు రూ.1,500లు ఫీజు చెల్లించి ఈనెల 30 వరకు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహిచనున్నట్లు మేఘనరావు తెలిపారు.
భద్రకాళి అమ్మవారికి
పవిత్రోత్సవం
హన్మకొండ కల్చరల్: శ్రావణపౌర్ణమిని పురస్కరించుకుని భద్రకాళి దేవాలయంలో అమ్మవారికి శనివారం పవిత్రోత్సవం నిర్వహించారు. చివరి రోజు ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఊర్ణసూత్రాల దండలను శాస్త్రోక్తంగా అమ్మవారిమూర్తి, స్నపనమూర్తులకు అలంకరించారు. పసుపు, ఎరుపు, నారింజ, నీలి, గులాబీ తదితర రంగుల ఊలు దారాలతో అలంకరించిన అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శేషు మాట్లాడుతూ పవిత్రోత్సవంతో ఆలయం, సకల జనులకు పవిత్రత చేకూరుతుందని అన్నారు. రక్షాబంధన విశిష్టతను వివరించారు. ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.

ఒక సీసీ కెమెరా వందమందితో సమానం