
ఆదివాసీ సంస్కృతిని పరిరక్షించాలి
● అదనపు కలెక్టర్ అనిల్ కుమార్
మహబూబాబాద్ అర్బన్: ఆదివాసీ సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాలని అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవం పురస్కరించుకొని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మదర్‌థెరిస్సా సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ కొమరంభీం విగ్రహం వరకు జిల్లా గిరిజన అధికా రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొమరంభీం విగ్రహానికి అదనపు కలెక్టర్ అనిల్ కుమార్, అధికారి గుగులోతు దేశీరాం నాయక్ పూలమాల వేసి నివాళులర్పించారు. గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ మాట్లాడు తూ.. ఆదివాసీ, గిరిజన బిడ్డల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయని అన్నారు. విద్యార్థులకు గిరిజన ఆశ్రమ పాఠశాలలో నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, సీబీఎస్ విద్యను అందిస్తున్నట్లు తెలిపా రు. చదువుతోపాటు ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేయాలని తెలిపారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి గుగులోతు దేశీరాం నాయక్ మాట్లాడుతూ.. మహనీయుల చరిత్ర, ఆదివాసీల కోసం పోరాడిన నాయకుల గురించి విద్యార్థులు అధ్యయనం చేయాలన్నారు. విద్యార్థులు విద్యతోపాటు ఆటపాటలో ముందుండాలని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల చదువులకు కృషి చేసి భవిష్యత్‌లో పది ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. ఈసందర్భంగా ఆదివాసీ ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో ఆదివాసీ రాష్ట్ర నాయకులు యాప సీతయ్య, గిరిజన సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపకులు గుగులోతు కిషన్ నాయక్, ఆదివాసుల రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్, జీసీడీఓ విజయ, ఎల్‌హెచ్‌పీఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ బోడ లక్ష్మణ్ నాయక్, హెచ్‌ఎంలు నర్సయ్య, కిషన్ నాయక్, హెచ్‌డబ్ల్యూఓ పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.