సీడబ్ల్యూసీ నియామకానికి మోక్షం | - | Sakshi
Sakshi News home page

సీడబ్ల్యూసీ నియామకానికి మోక్షం

Aug 9 2025 7:43 AM | Updated on Aug 9 2025 7:43 AM

సీడబ్ల్యూసీ నియామకానికి మోక్షం

సీడబ్ల్యూసీ నియామకానికి మోక్షం

మహబూబాబాద్‌: బాలల సంక్షేమ సమితి (సీడబ్ల్యూసీ) నియామకానికి ఎట్టకేలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. కమిటీ కాలపరిమితి ముగిసిన 17 నెలల తర్వాత నూతన కమిటీ కోసం నోటిఫికేషన్‌ వేశారు. అయితే కనీసం ప్రకటన కూడా విడుదల చేయకపోవడంతో చాలా మంది అర్హులు సమా చారం లేక దరఖాస్తు చేసుకోలేదు.

బాలరక్షా భవన్‌లోనే..

జిల్లా కేంద్రంలోని బాలరక్షా భవన్‌లోనే జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ, బాలల న్యాయ మండలి, చైల్డ్‌లైన్‌ 1098, డిస్ట్రిక్ట్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్‌, చైల్డ్‌ లెవల్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, పిల్లల పోలీస్‌ యూనిట్‌ విభాగాలు కొనసాగుతున్నాయి. ఆ కార్యాలయంలో సుమారు 35 మంది పని చేస్తుండగా ప్రత్యేక వాహనం కూడా కేటాయించారు. సీడబ్ల్యూసీ కమిటీని 2021 ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు. కమిటీలో చైర్మన్‌తో పాటు నలుగురు సభ్యులు ఉంటారు. పదవీకాలం మూడేళ్లు కాగా.. 2024 ఫిబ్రవరిలో పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి నోటిఫికేషన్‌ విడుదల కాలేదు. దీంతో ఆ కమిటీనే కొనసాగుతోంది.

15 రోజుల క్రితం నోటిఫికేషన్‌..

నూతన కమిటీ నియామకం కోసం మహిళా, శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ నుంచి నోటిఫికేషన్‌ విడుదల అయినట్లు ఆశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. ఆన్‌లైన్‌లో డబ్ల్యూసీడీ (ఉమెన్‌ చైల్డ్‌ డిపార్ట్‌మెంట్‌) వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆ నోటిఫికేషన్‌లో ఉంది.

అర్హతలివే..

పీజీలో ఎంఎస్‌డబ్ల్యూ (మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌, సోషియాలజీ) కోర్సు పూర్తి చేసి ఉండాలి. 35 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసు వారు అర్హులు. ఏడు సంవత్సరాల పాటు పిల్లల కోసం పని చేసిన అనుభవం, ఆ సంస్థ (ఎన్జీఓ) నుంచి జారీ చేసిన సర్టిఫికెట్‌ ఉండాలి. ముందుగా దరఖాస్తుదారులు కమిటీ చైర్మన్‌, సభ్యుల పదవుల కోసం దరఖాస్తు చేసుకుంటారు. అనంతరం ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారని అధికారులు పేర్కొన్నారు. పరీక్షలో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా చైర్మన్‌తో పాటు సభ్యులను నియమిస్తారు.

కమిటీకి గౌరవ వేతనం..

కమిటీ చైర్మన్‌తో పాటు సభ్యులకు సమానమైన గౌరవ వేతనం ఉంటుంది. కానీ ప్రొటోకాల్‌ ప్రకారం చైర్మన్‌కు ప్రాధాన్యత ఉంటుంది. జీరో నుంచి 18సంవత్సరాలలోపు బాలబాలికల సమస్యలన్నీ వారి పరిధిలోకే వస్తాయి. బాల్య వివాహాలు, బాల కార్మికులు, పిల్లల అక్రమ రవాణా, అమ్మకాలు చేస్తే చర్యలు తీసుకుంటారు. పిల్లల దత్తత, తదితర అంశాలు సీడబ్ల్యూసీ పరిధిలోకి వస్తాయి. కార్యాలయంలో సీడబ్ల్యూసీ కోర్టు నిర్వహిస్తారు. నెలలో 20సార్లు ఆ కోర్టులో కేసుల విచారణ నిర్వహిస్తారు. ఒక్కసారి నిర్వహిస్తే ఐదుగురు కమిటీ సభ్యులకు గానూ ఒక్కొక్కరికి రూ.2000 చొప్పున వస్తాయి. ఇలా వారికి నెలకు రూ.40,000వరకు వస్తాయి. హాజరు కాకపోతే వేతనం తగ్గుతుంది.

నోటిఫికేషన్‌పై గోప్యం..

మహిళా,శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ నుంచి ఎలాంటి సమాచారం వచ్చిన జిల్లాలో ప్రకటన రూపంలో తెలియజేస్తారు. కానీ సీడబ్ల్యూసీ, బాలల న్యాయ మండలి సభ్యుల నియామక నోటిఫికేషన్‌ విషయంలో జిల్లాలోని డీడబ్ల్యూఓ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేయలేదు. దీంతో అర్హత ఉన్న వారు సమాచారం లేకపోవడంతో దరఖాస్తు చేసుకోలేదు.

బాలల న్యాయ మండలిలో సభ్యుల నియామకం కోసం కూడా..

అలాగే బాలల న్యాయమండలి సభ్యుల నియామకం కోసం కూడా నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఆ విభాగం పరిధిలోకి జీరో నుంచి 18 సంవత్సరాలలోపు బాలబాలికలు వస్తారు. చట్టంతో విబేధించిన పిల్లలు, దొంగతనాలు, హత్యలు చేసిన వారు ఆ విభాగంలోకి వస్తారని అధికారులు పేర్కొన్నారు. ఆ విభాగంలో ఇద్దరు సభ్యుల ఉంటారు. వారి పదవీకాలం పూర్తి కావడంతో నోటిఫికేషన్‌ విడుదల చేశారు. కాగా ఆ దరఖాస్తుల గడు వు కూడా ఈనెల 8తో ముగిసింది. దీనికి కూ డా ఎంఎస్‌డబ్ల్యూ కోర్సు పూర్తి చేసి ఏడు సంవత్సరాల పాటు పిల్లల కోసం పనిచేసిన అ నుభవం ఉండాలి. వారంలో ఒక్కరోజు కా ర్యాలయంలో కోర్టు మాదిరిగా నిర్వహిస్తారు. జడ్జి వచ్చి పరిష్కరిస్తారు. సభ్యులకు ఒక్కొక్కరికి నెలకు రూ.8,000 వేతనం ఉంటుంది. వారు వారంలో ఒక్కరోజు మాత్రమే వస్తారు.

ముగిసిన దరఖాస్తుల గడువు

నోటిఫికేషన్‌ విడుదలలో గోప్యం

దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement