
ఎస్పీకి రాఖీలు కట్టిన విద్యార్థినులు
మహబూబాబాద్ రూరల్ : మానుకోట పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్‌ఎఫ్‌ఐ గర్ల్స్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌కు విద్యార్థినులు శుక్రవారం రాఖీలు కట్టారు. ఎస్ ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి మన్నూరు నిక్షిప్త, జిల్లా నాయకురాళ్లు శృతి, జాస్మిన్, నాయకులు జ్యోతిబసు, రాకేశ్, మహేశ్, వినోద్ ఉన్నారు.
చట్టబద్ధతతోనే పిల్లలకు హక్కులు
మహబూబాబాద్ : చట్టబద్ధతతోనే పిల్ల లకు హక్కులు వస్తాయని ఇన్‌చార్జ్ డీడబ్ల్యూఓ శిరీష అన్నారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాల రక్షాభవన్‌లో పిల్లలను దత్తత తీసుకోవాలనుకునే వారితో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దత్తత తీసుకున్న వారు పిల్లలను ప్రేమ, వాత్సల్యంతో పెంచాలన్నారు. పిల్లలు లేని దంపతులు జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను సంప్రందించాలన్నారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ నాగవాణి, బాలల సంరక్షణ అధికారులు నరేష్, వీరన్న, కౌన్సిలర్ రమేశ్, కమిటీ సభ్యుడు డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.
అప్రెంటిస్‌షిప్ మేళా
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులకు ఈ నెల 11న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉదయం 11గంటలకు జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. బాబు శుక్రవారం తెలిపారు. అర్హులు ఆన్‌లైన్‌లో మహబూబాబాద్ అప్రెంటిస్‌షిప్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకొని, సంబంధిత ధ్రువపత్రాలు ఐటీఐ కళాశాలలో సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా కేంద్రం ఇల్లెందు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సంప్రదించాలన్నారు.
కేంద్ర బృందం సందర్శన
పెద్దవంగర: మండలంలోని వడ్డెకొత్తపల్లి పల్లె దవాఖానను ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్సీ బృందం శుక్రవారం సందర్శించింది. దేశ వ్యాప్తంగా జాతీయ గ్రేడింగ్ పరిశీలనకు దవాఖాన ఎంపిక కాగా.. అందుతున్న 12 రకాల వైద్య సేవలపై కేంద్ర బృంద సభ్యులు రమణీ, గంగాధరన్ సమీక్షించారు. గర్భిణులు, బాలింతల సంరక్షణ, కౌమర బాలికలకు అందించే సేవలు, సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల నివారణ, ప్రాథమిక వైద్యం, కుటుంబ నియంత్రణ, శిశు సంరక్షణ వంటి సేవలు సంతృప్తి కరంగా ఉన్నట్లు పరిశీనలలో తేలింది. మరో ఐదు రకాల సేవలు పాక్షికంగా అందిస్తున్నట్లు గుర్తించారు. అలాగే ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా లభిస్తున్న ప్రయోజనాలు, మాతా–శిశు మరణాల నియంత్రణ, చర్యలు వంటి అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్ర బృంద సభ్యులు మాట్లాడుతూ.. రోగులకు అందుతున్న సేవలు, గుర్తించిన లోపాలు, మెరుగైన వైద్య సౌకర్యాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదికను జాతీయ ఆరోగ్య మిషన్ అధికారులకు అందిస్తామని వెల్లడించారు.

ఎస్పీకి రాఖీలు కట్టిన విద్యార్థినులు

ఎస్పీకి రాఖీలు కట్టిన విద్యార్థినులు