
రైల్వే క్యాంపింగ్ బోగి దగ్ధం
కేసముద్రం: ప్రమాదవశాత్తు రైల్వే క్యాంపింగ్ కోచ్(బోగి) దగ్ధమైన సంఘటన కేసముద్రం రైల్వేస్టేషన్‌లో గురువారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కొత్తగా చేపడుతున్న రైల్వే థర్డ్‌లైన్ పనుల్లో భాగంగా కేసముద్రం రైల్వేస్టేషన్‌లోని థర్డ్‌లైన్ పక్కనున్న లూప్‌లైన్‌పై రైల్వే క్యాంపింగ్ కోచ్‌ను నిలిపారు. థర్డ్‌లైన్ పనుల అనంతరం నలుగురు సిబ్బంది (ఇద్దరు టెక్నిషియన్స్, ఇద్దరు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది) ఆ క్యాంపింగ్ కోచ్‌లో నిద్రించేందుకు ఎక్కారు. ఈ క్రమంలో బోగిలో పొగలు వస్తుండటంతో గమనించిన నలుగురు అప్రమత్తమయ్యారు. మంటలు వ్యాపిస్తుండటంతో చల్లార్పే ప్రయత్నం చేసిన తగ్గకపోవడంతో బయటకు పరుగులు తీశారు. అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత సంఘటన స్థలానికి మానుకోట, డోర్నకల్ నుంచి రెండు ఫైరింజన్‌లు చేరుకుని మంటలు ఆర్పివేశాయి. బోగిలో ఉన్న సిబ్బందికి సంబంధించిన దుస్తులు, ఇతర సామగ్రితోపాటు, సీట్లు, ఏసీ, ఫ్యాన్‌లు దగ్ధం కాగా, 8 ఆయిల్ డ్రమ్ములు సురక్షితంగా ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే భోగి దగ్ధమైనట్లుగా రైల్వే అధికారులు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. క్యాంపింగ్ బోగి దగ్ధంతో రూ.కోటికి పైగా నష్టం వాటిల్లినట్లు సమాచారం. శుక్రవారం సంఘటనా స్థలాన్ని ప్రిన్సిపల్ ఛీప్ ఇంజనీరింగ్(పీసీఈ) ఆంజనేయులురెడ్డి, పీసీఎంఈ ధర్మేందర్‌కుమార్, సీనియర్ ఎస్పీ సికింద్రాబాద్ కె.నవీన్‌కుమార్, ఏడీఆర్‌ఎం గోపాలక్రిష్ణతోపాటు పలువురు అధికారులు సందర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై విచారణ చేపట్టారు. ఘటనపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి విచారించనున్నారు.
అర్ధరాత్రి సమయంలో కేసముద్రం రైల్వేస్టేషన్‌లో ఘటన
నలుగురు సిబ్బందికి తప్పిన ప్రమాదం
షార్ట్‌సర్క్యూట్ కారణమని అంచనా..?

రైల్వే క్యాంపింగ్ బోగి దగ్ధం