
కొత్తగూడ ఏజెన్సీలో పులి సంచారం?
కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీలో పులి సంచారం మళ్లీ కలకలం రేపుతోంది. మండలంలోని రాంపూర్ అటవీ ప్రాంతంలో దుక్కిటెద్దును చంపి తిన్నట్లు ఆలస్యంగా గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన పుల్సం పెద్ద సాంబయ్యకు చెందిన దుక్కిటెద్దు వారం రోజుల క్రితం మేతకు వెళ్లి తిరిగి రాలేదు. ఎద్దు కోసం పరిసర గ్రామాల్లో, అడవిలో వెతుకుతుండగా దట్టమైన అటవీ ప్రాంతంలో ఎద్దు కళేబరం కనిపించింది. కళేబరంలో కొంత భాగం కొంత దూరంలో కనిపించడంతో అనుమానం వచ్చిన రైతు పెద్దసాంబయ్య అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన ఎఫ్‌ఆర్వో వజ్రహత్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ పులి అడుగులు కనిపించడంతో ఎద్దును పులి వేటాడినట్లు నిర్ధారించారు. రాంపూర్, సరసనపల్లి, పూనుగొండ్ల, కర్నెగండి, కోనాపురం గ్రామాల ప్రజలు పశువులను మేపేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లవద్దని సూచనలు చేశారు. గత సంవత్సరం కోనాపూర్ అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న పొలాల్లో అధికారులు పులి పాద ముద్రలు గుర్తించారు. ఆ పులి పూనుగొండ్ల మీదుగా కిన్నెరసాని అటవీ ప్రాంతానికి వెళ్లిపోయినట్లు పాద ముద్రల ఆధారంగా అంచనాకు వచ్చారు. అయితే అది వెళ్లిందా లేక ఈ అటవీ ప్రాంతంలో ఆవాసం ఏర్పాటు చేసుకుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రాంపూర్ అడవుల్లో దుక్కిటెద్దును
చంపినట్టు నిర్ధారణ