ఆన్‌లైన్‌ గేమ్స్‌తో జాగ్ర‌త్త‌! లేదంటే ఇలా జరుగుతుందేమో!?

- - Sakshi

ఆన్‌లైన్‌ గేమ్స్‌లో చిక్కుకున్న యువత..

అప్పులపాలై చివరకు ఆత్మహత్యలు!

శోకసంద్రంలో ఆయా కుటుంబాలు..

అవగాహన కల్పించాలని వేడుకోలు!

మహబూబాబాద్‌: నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఈ ఫోన్ల కారణంగా పిల్లలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతుంటే.. యువకులు, ఆపై పడిన వారు పెడదారి పడుతున్నారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో అనేక క్రీడలకు సంబంధించి బెట్టింగ్‌లకు పాల్ప డడం, రుణాలు తీసుకోవడం, ఆఫర్ల పేరుతో మోసపోతూ దిక్కుతోచని స్థితికి చేరుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, రమ్మీ, లూడో, క్రికెట్‌ బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌తో పాటు అనేక రకాల ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు.

కొంత మంది తేరుకొని వీటికి దూరమవుతుంటే చాలా మంది తమ ఆస్తులను విక్రయించుకునే దుర్భర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తల్లిదండ్రులకు తెలియకుండా వాహనాలు, ఆభరణాలు కూడా తనఖాలు పెట్టి జూదం ఆడుతున్నారు. నర్సంపేట పట్టణంలోని ఓ బ్యాంకు అధికారి కొద్ది రోజుల క్రితం బ్యాంకుకు సంబంధించిన డబ్బులతో ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నాడు. దీంతో చివరకు జైలు పాలయ్యాడు. ఇలా పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఎంతో మంది యువకులు మోసపోతున్నారు.

అవగాహన లేక అవస్థలు..
పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత నిత్యం స్మార్ట్‌ ఫోన్లతో గడిపేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌ గేమ్స్‌ బారిన పడుతున్నారు. ఫలితంగా ఆయా కుటుంబాలు రోడ్డున పడుతున్న పరిస్థితి ఏర్పడుతోంది. కాగా, యువతకు అవగాహన లేకపోవడంతోనే ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఆన్‌లైన్‌ గేమ్స్‌పై యువతకు అవగాహన కల్పించి ఆయా కుటుంబాలను శోకసంద్రం నుంచి రక్షించాలని పలువురు పేర్కొంటున్నారు.

ఆన్‌లైన్‌ గేమ్స్‌తో ఎంతో మంది జీవితాలు నాశనమవుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి, ధనిక వర్గాలకు చెందిన యువతతో పాటు మధ్య వయసు కలిగిన వారు కూడా ఆన్‌లైన్‌ ఉచ్చులో పడుతున్నారు. కష్ట పడకుండా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఆన్‌లైన్‌ క్రీడల్లో పాల్గొంటున్నారు. తక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ పొందాలనే ఆశతో ఆన్‌లైన్‌ జూదం వైపు మరలుతూ చివరకు అప్పులపాలై క్షణికావేశంలో బలవన్మరణలకు పాల్పడుతున్నారు. దీంతో ఆయా కుటుంబాలు కన్నీటిసంద్రంలో మునుగుతున్నాయి.

ఘటనలు..!

  • నెక్కొండ మండలం అప్పల్‌రావుపేటకు చెందిన బాషబోయిన ఉదయ్‌(20) ఈ ఏడాది జూన్‌ 24న అర్ధరాత్రి ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడాడు. కాగా, ఉదయ్‌ మొబైల్‌ ఫోన్‌కు తల్లి స్వప్న పేరిట బ్యాంకు ఖాతా అనుసంధానమై ఉంది. ధాన్యం అమ్మిన డబ్బులు రూ.50 వేలు ఆమె బ్యాంకు ఖాతాలో అదే రోజు ఉదయం జమ అయ్యాయి. రాత్రి ఒంటరిగా ఉన్న ఉదయ్‌(రమ్మీ) ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతుండగా రూ.46 వేలు పోగొట్టుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు మందలిస్తారని భయపడిన ఉదయ్‌.. ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
  • నర్సంపేట పట్టణంలోని మాధన్నపేట రోడ్డులో ఉంటున్న మిట్టపల్లి సాయిబాబా, మమత దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరి కుమారుడు ప్రశాంత్‌ నర్సంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. సుజాత అనారోగ్యంతో పదేళ్ల క్రితం మృతి చెందింది. సాయిబాబా దర్జీ(టైలర్‌) పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రశాంత్‌ ఆన్‌లైన్‌ గేమ్‌తో మోసపోవడంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన ప్రశాంత్‌ నవంబర్‌ 22న ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
    ఇవి కూడా చ‌ద‌వండి: మృతదేహాల కలకలం! అస‌లేం జ‌రుగుతుంది?
Read latest Mahabubabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top