కర్నూలు(అగ్రిల్చర్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, వీబీ జీ రామ్ జీ కింద తుగ్గలి మండలంలో జరిగిన అక్రమాలపై విచారణ ముమ్మరంగా జరుగుతోందని అంబుడ్స్‌మన్ సురేంద్ర కుమార్ తెలిపారు. తుగ్గలి పంచాయతీతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించిన ఉపాధి పనుల్లో అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదులు వచ్చాయన్నారు. వీటన్నింటిపై దశల వారీగా విచారణ జరుపుతున్నామన్నారు. తమ విచారణలో వెలుగు చూసిన అక్రమాలకు సంబంధించి ఇప్పటికే డ్వామా అధికారులు చర్యలు కూడా తీసుకుంటున్నారని గురువారం ఆయన ‘సాక్షి’కి తెలిపారు.
మార్కెట్‌లకు తగ్గిన పంట ఉత్పత్తులు
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు వ్యవసాయ ఉత్పత్తులు తక్కువగా వచ్చాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో దాదాపు అన్ని పంటలు తక్కువగా వచ్చాయి. ఉల్లిగడ్డలు 3,960 క్వింటాళ్లు(161 లాట్లు) రాగా.. కనిష్ట ధర రూ.701, గరిష్ట ధర రూ.4260 లభించగా.. సగటు ధర రూ.3,240 నమోదైంది. కర్నూలు మార్కెట్‌లో వేరుశనగ ధర తగ్గింది. కనిష్ట ధర రూ.4,313, గరిష్ట ధర రూ.7,913 లభించగా... సగటు ధర రూ.7,694 పలికింది. మొక్కజొన్న ధర పెరిగింది. కనిష్ట ధర రూ.2,940, గరిష్ట ధర రూ.3,010 నమోదైంది. మిర్చి రెడ్ రకానికి కనిష్ట ధర రూ.15,009 లభించగా.. గరిష్ట ధర రూ.23,709 పలికింది. సజ్జలకు గరిష్ట ధర రూ.3,301 నమోదైంది. ఆదోని మార్కెట్‌కు పత్తి కేవలం 355 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. కనిష్ట ధర రూ.6,219, గరిష్ట ధర రూ.9,323 లభించగా.. సగటు ధర రూ.8951 నమోదైంది. ఆదోని మార్కెట్‌లో వేరుశనగకు కనిష్ట ధర రూ.5,162, గరిష్ట ధర రూ.8,200 లభించగా.. సగటు ధర రూ.7,676 పలికింది.
ఖైదీలకు ఉచిత న్యాయ సేవలు
డోన్ టౌన్: రిమాండ్ ఖైదీలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. పట్టణంలోని సబ్ జైలును గురువారం మేజిస్ట్రేట్ జ్యోతితో కలిసి ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. జైలులో ఏర్పాటు చేసిన ప్రిజన్ లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్, క్లినిక్ గురించి ఖైదీలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ౖఖైదీల తమ హక్కులను తెలుసుకోవాలన్నారు. న్యాయవాదులు నియమించుకోలేని వారికి ఉచితంగా ఏర్పాటు చేస్తామన్నారు. 70 ఏళ్లు పైబడిన వారికి, అనారోగ్యంతో బాధపడే వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. అనంతరం జైలులో వసతులు, వైద్య సేవలపై ఆరా తీశారు. ఖైదీలను కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఏవైన సమస్యలు ఉంటే 15100 నంబర్‌ను సంప్రదించాలన్నారు. ఈ తనిఖీల్లో జైలు సూపరింటెండెంట్ సురేష్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ శివరామచంద్రరావు కోర్టు సిబ్బంది ఉన్నారు.
భారత వైమానిక దళంలో ఉద్యోగావకాశాలు
నంద్యాల(న్యూటౌన్): జాతీయ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న భారత వైమానిక దళంలో యువతకు లభించే ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పించేందుకు డిసెంబర్ 6వ తేదీన నంద్యాలలో ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో భారత వైమానిక దళానికి చెందిన 12వ ఎయిర్‌మెన్ సెలెక్షన్ సెంటర్ ప్రతినిధులు శేఖర్, నిధీష్‌లు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి కలిసి, డిసెంబర్ 6న నంద్యాలలో నిర్వహించనున్న యువత అవగాహన కార్యక్రమానికి సంబంధించిన అధికారిక వినతిపత్రాన్ని సమర్పించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అనువైన వేదిక కేటాయించడం, జిల్లాలోని కళాశాలల నుంచి విద్యార్థులను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేయడం, విస్తృత ప్రచారం కల్పించడం వంటి అంశాల్లో జిల్లా యంత్రాంగం సహకరించాలని ప్రతినిధులు కలెక్టర్‌ను కోరారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా జిల్లాలోని యువతకు భారత వైమానిక దళంలోని ఉద్యోగావకాశాలు, అర్హతలు, ఎంపిక విధానంపై స్పష్టమైన అవగాహన కలగడంతో పాటు, దేశ రక్షణలో భాగస్వాములయ్యే దిశగా ప్రోత్సాహం లభించనుందని కలెక్టర్ తెలిపారు.


