కొలిమిగుండ్ల: కోర్నపల్లె సమీపంలోని గుండం ఆంజనేయస్వామి ఆలయ శివార్లలోని గుహలో గురువారం శివలింగం బయటపడింది. ఏడాదిన్నర క్రితం గుహ ఆనవాళ్లు కనిపించడంతో అబ్దులాపురం, కోర్నపల్లె గ్రామాలకు చెందిన భక్తులు ముందు భాగంలో అతి కష్టం మీద మట్టిని తొలగించగా లోపల విశాలమైన గుహ కనిపించింది. పెద్ద బండరాళ్లు అడ్డుగా ఉండటంతో అప్పట్లో పనులు విరమించారు. తాజా గా భక్తులు గుహ వద్దకు చేరుకొని అడ్డుగా ఉన్న బండరాళ్లను తొలగించి సుమారు. 120 అడుగుల మేర ముందు కెళ్లారు. లోపల ఒక చోట పీఠం మాదిరిగా ఉన్న చోట శివ లింగం కనిపించడంతో భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. పైనుంచి తరచూ నీటి బొట్లు లింగం మీద పడుతున్న దృశ్యాలను తిలకించారు. గుహ లోపల చిమ్మ చీకటి ఉన్నా ఊపిరాడక పోయినా అతి కష్టం మీద సెల్‌ఫోన్ లైట్ల సాయంతో శివలింగాన్ని శుభ్రం చేశారు. అనంతరం పూజలు నిర్వహించారు. గుహలో పలు చోట్ల విశాలమైన మార్గాలు ఉన్నాయని భక్తులు పేర్కొన్నారు.


