కర్నూలు: పరిషత్ ఎన్నికల బందోబస్తు విషయంలో జిల్లా పోలీసు బాస్ చేసిన ప్రకటనలు కూటమి నాయకుల దౌర్జన్యకాండ ముందు పటాపంచలయ్యాయి. కూటమి నాయకుల దౌర్జన్యాలు, సైక్లింగ్, రిగ్గింగ్, యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకున్నా పోలీసులు కనీసం నిలువరించే ప్రయత్నం చేయలేదు. మున్సిపల్ ఎన్నికల తరహాలోనే పరిషత్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కూటమి నాయకులు అనుకున్న వ్యూహాలను అమలు చేశారు. ఇందుకు పోలీసులు ప్రత్యక్షంగానే మద్దతు ఇచ్చారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఓటర్లను ప్రభావితం చేయగలిగిన వైసీపీ నాయకులను ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం మండలానికి పది మంది చొప్పున ముందస్తు అరెస్టులు చేసి పోలింగ్ ముగిసిన తర్వాత వదిలారు. కర్నూలు రూరల్ మండల పరిధిలో ఆర్.కొంతలపాడు, సుంకేసుల, తొలిశాపురం, ఎదురూరు, ఆర్‌కే దుద్యాల గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బెదిరించి పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు పంపించి తెలుగుదేశం గూండాలు ఏకపక్షంగా రిగ్గింగ్ చేసుకున్నారు. ఆలూరు నియోజకవర్గంలో 5 పోలీస్‌స్టేషన్ల పరిధిలో సుమారు 100 మందికి పైగా వైఎస్సార్‌సీపీ నాయకులను ముందస్తు అరెస్టులు చేసి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. చిప్పగిరి మండలం గుమ్మనూరులో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బెదిరించి కూర్చోకుండా చేశారు. ఆలూరు టౌన్ బాయ్స్ స్కూల్‌లో ఒకటవ పోలింగ్ కేంద్రంలో ఎంపీటీసీ అభ్యర్థులు బోయ భాస్కర్, బోయ వరుణ్‌కుమార్‌ను చంపేస్తామని టీడీపీ నాయకులు బెదిరించి బయటకు పంపించి రిగ్గింగ్ చేసుకున్నారు. అలాగే పత్తికొండ, క్రిష్ణగిరి మండలాల్లో కూడా పోలీసులు పచ్చమూకలకు ఏకపక్షంగా సహకరించారు. క్రిష్ణగిరిలోనూ ఏజెంట్లు లేకుండా పోలీసులు బెదిరింపులకు పాల్పడటం గమనార్హం.


