కర్నూలు(సెంట్రల్): జిల్లాలో జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ సిరి పర్యవేక్షించారు. సంబంధిత రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధిక సంఖ్యలో ప్రజలు గుమిగూడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ సి. వెంకట నారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనురాధ పాల్గొన్నారు.
జిల్లాలో 68.29 శాతం పోలింగ్
● అత్యధికంగా కల్లూరు మండలంలో
81.79 శాతం
● అత్యల్పంగా కోసిగిలో 54.44 శాతం
కర్నూలు(అర్బన్): జిల్లాలో గురువారం జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 68.29 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం ఓటర్లు 12,49,212 కాగా ఇందులో 8,52,335 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 26 మండలాల్లో జరిగిన పోలింగ్‌ను పరిశీలిస్తే అత్యధికంగా కల్లూరు మండలంలో మొత్తం ఓటర్లు 38,479 మంది ఉండగా, 31,473 మంది (81.79 శాతం) ఓటింగ్‌లో పాల్గొన్నారు. అత్యల్పంగా కోసిగి మండలంలో 55,831 మంది ఓటర్లకు గాను 30,395 (54.44 శాతం) మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ మండలంలో ఆర్లబండ పోలింగ్ బూత్ 2/2లో ఈ నెల 6వ తేదీన రీపోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ కేంద్రంలో 954 మంది ఓటర్లు ఉన్నారు. టీడీపీ నేతలు ఈ పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్‌కు పాల్పడడంతో ఇక్కడ రీపోలింగ్ నిర్వహిస్తున్నారు.
ఓటేసిన కొద్దిసేపటికే
వృద్ధురాలు మృతి
ఆస్పరి: జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఓ వృద్ధురాలు గుండెపోటుతో మరణించింది. కర్నూ లు జిల్లా ఆస్పరి మండలంలోని హలిగేరలో నరసమ్మ(61) ఓటు వేసి ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో స్పృహ తప్పి పడిపోయింది. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రెండేళ్ల క్రితం ఈమె భర్త, కుమారుడు గుండెపోటుతోనే మృతి చెందారు.


