ఎమ్మిగనూరుటౌన్: మహిళలకు ప్రతి నెల రూ.1500లు ఇస్తామని నమ్మించి చంద్రబాబు మమ్మల్ని మోసం చేశాడని పట్టణంలోని 11వ వార్డు మహిళలు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్రెడ్డికి చెప్పారు. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు, కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కోసం సోమవారం పట్టణంలోని 11వ వార్డులో ప్రచారానికి వెళ్లిన ఆయనకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తాము టీడీపీ నాయకుల మాటలు నమ్మి మోసపోయామని వివరించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా రూ.18000లు మాజీ సీఎం వైఎస్ జగన్ నేరుగా తమ బ్యాంక్ అకౌంట్లలో జమ చేశారని గుర్తు చేశారు. ఓట్ల కోసం టీడీపీ 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు రూ.1500లు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇచ్చిన హామీ అమలు చేయక మోసం చేసిందని వాపోయారు.


