శ్రీరాంరెడ్డిపై హత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

శ్రీరాంరెడ్డిపై హత్యాయత్నం

Oct 24 2026 5:53 AM | Updated on Oct 24 2026 5:53 AM

● ఎంపీటీసీ నామినేషన్‌ వేస్తారేమోనని భార్య, పిల్లలను ఈడ్చి పడేసి టీడీపీ నాయకులు, కార్యకర్తల దాడి ● అడ్డుకోబోయిన మరో వ్యక్తి, ఇళ్ల వద్ద ఉన్న మరో ఇద్దరిపై దాడి

అల్లుగుండు వైఎస్సార్‌ సీపీ నేత
● ఎంపీటీసీ నామినేషన్‌ వేస్తారేమోనని భార్య, పిల్లలను ఈడ్చి పడేసి టీడీపీ నాయకులు, కార్యకర్తల దాడి ● అడ్డుకోబోయిన మరో వ్యక్తి, ఇళ్ల వద్ద ఉన్న మరో ఇద్దరిపై దాడి

వెల్దుర్తి: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు గ్రామ వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీరాంరెడ్డిపై శుక్రవారం అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఘటనలో శ్రీరాంరెడ్డికి తీవ్ర గాయాలతో పాటు చేయి, కాలు విరిగిపోయాయి. భార్య నిరీషా రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. అడ్డుకోబోయిన మరో వైఎస్సార్‌సీపీ కార్యకర్త మల్లికార్జునపై సైతం దాడి చేసి గాయపర్చారు. ఇళ్ల వద్ద ఉన్న మరో ఇద్దరు కార్యకర్తలు పక్కీర, శీలన్నపై సైతం దాడికి పాల్పడ్డారు. శ్రీరాంరెడ్డి ఎంపీటీసీగా మల్లెపల్లె స్థానానికి వైఎస్సార్‌సీపీ తరపున నామినేషన్‌ వేస్తాడేమోనని భావించి టీడీపీ నాయకులు హత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితుడు శ్రీరాంరెడ్డి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివీ..

శుక్రవారం ఉదయం ప్రతిరోజు లాగే శ్రీరాంరెడ్డి, భార్య నిరీష రెడ్డి, తమ ఇద్దరు పిల్లలను స్కూలుకు తీసుకెళ్లేందుకు ఇంటి ముందు కారులోకి ఎక్కే ప్రయత్నంలో ఉన్నారు. శ్రీరాంరెడ్డి, పిల్లలు కారులో కూర్చున్నారు. భార్య ఎక్కబోయే తరుణంలో అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు బాలమద్ది వేగంగా బైక్‌పై వచ్చి నిరీషా రెడ్డిని ఢీకొట్టాడు. ఈ క్రమంలో ఆమె కిందపడిపోగా డ్రైవింగ్‌ సీటులోని శ్రీరాంరెడ్డి కిందకు దిగాడు. వెంటనే అక్కడ కాపు కాసిన టీడీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యులు రమేశ్‌, నాగమద్ది, దశరథుడు, రామాంజనేయులు ఒక్కసారిగా శ్రీరాంరెడ్డిపై కర్రలతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇష్టమొచ్చిన రీతిలో కొడుతున్న తరుణంలో అడ్డుకోబోయిన భార్యను అక్కడే ఉన్న నిందితుల కుటుంబ సభ్యులు రాజేశ్వరి, సూరమ్మలు జుట్టు పట్టుకొని ఈడ్చిపడేశారు. భార్య ఎదురుగానే భర్తను దాదాపు 20 నిమిషాల పాటు కర్రలతో బాదగా పిల్లలు సైతం వచ్చి వేడుకున్నా ఆపలేదు. అడ్డుకోబోయిన గ్రామానికి చెందిన మల్లికార్జునను సైతం బాదేశారు. శ్రీరాంరెడ్డి అపస్మారక స్థితికి చేరుకుంటున్న తరుణంలో వదిలేసి వె వెళ్లారు. ఆ తర్వాత కూడా గ్రామంలో వీరంగం సృష్టిస్తూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పక్కీర, శీలన్నల ఇంటి వద్దకు వెళ్లి వారిపై సైతం దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాల పాలైన శ్రీరాంరెడ్డిని కుటుంబ సభ్యులు తమ కారులోనే కర్నూలులోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రి చేరుకుని బాధితుల ఫిర్యాదు తీసుకున్నారు.

పిరికిపంద చర్య

ఎన్నికల్లో విజయం సాధించలేమని తెలిసిన టీడీపీ నాయకులు నామినేషన్‌ వేస్తారేమోనన్న అనుమానాలతో తమ నాయకులపై హత్యాయత్నాలకు, దాడులకు పాల్పడడం పిరికి పంద చర్య అని ౖవైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెరుకులపాడు ప్రదీప్‌ రెడ్డి అన్నారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీరాంరెడ్డిని, మల్లికార్జునను ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తనయుడు రామ్మోహన్‌ రెడ్డి పరామర్శించారు. అన్ని కాలాలు తమవిగా ఉండవని టీడీపీ నాయకులు, కార్యకర్తలు గమనించాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement