అమరవీరుల సంస్మరణ దినోత్సవ రిహార్సల్‌ ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

అమరవీరుల సంస్మరణ దినోత్సవ రిహార్సల్‌ ర్యాలీ

Oct 19 2026 2:01 AM | Updated on Oct 19 2026 2:01 AM

కర్నూలు: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం అక్టోబర్‌ 21ని పురస్కరించుకుని నగరంలో పోలీసులతో ఆదివారం రిహార్సల్స్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంస్మరణ వారోత్సవాలు నెలాఖరు వరకు నిర్వహించనున్నారు. అడ్మిన్‌ అడిషనల్‌ ఎస్పీ హుసేన్‌పీరా, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ కృష్ణమోహన్‌ పర్యవేక్షణలో కొండారెడ్డి బురుజు వద్ద ప్రారంభమైన రిహార్సల్‌ ర్యాలీ కంట్రోల్‌ రూమ్‌ వరకు, అక్కడినుంచి తిరిగి పోలీసు కార్యాలయం వరకు సాగింది. దేశ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ సంస్మరణ వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆర్‌ఐలు నారాయణ, జావేద్‌, ఎస్‌ఐలు,ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది,ట్రైనీ పోలీసులు ర్యాలీలో పాల్గొన్నారు.

మూడు దుకాణాలు దగ్ధం

● ప్రాణాలతో బయటపడిన

ఇద్దరు కార్మికులు

పత్తికొండ: పట్టణ శివారులో కర్నూలు రహదారిలో బుడగ జంగాల కాలనీ సమీపంలో శనివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదంలో మూడు దుకాణాలు దగ్ధం కాగా.. స్థానికుల కేకలతో ఇద్దరు కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు. ముందుగా మమతా గ్యారేజ్‌లో చెలరేగిన మంటలు క్షణాలలో పక్కనే కల్యాణి బిర్యాని హోటల్‌, వెల్డింగ్‌షాపునకు వ్యాపించాయి. సమీపంలో ఉన్నవారు మంటలను గుర్తించి ఫైరింజన్‌ అధికారులుకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే గ్యారేజీలో పని చేసేవారు ఇద్దరు కార్మికులు అందులోనే నిద్రిస్తున్నారు. నిద్ర మత్తులో మంటలను గమనించకుండా అలాగే ఉండిపోయారు. గమనించిన స్థానికులు కేకలు వేసి బయటకు రప్పించారు. క్షణాల్లో వారిని అప్రమత్తం చేయడంతో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం వల్ల మూడు దుకాణాలలో దాదాపు రూ. 1.50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక అధికారులు అంచనా వేశారు.

నేడు కిరణ్‌ అంత్యక్రియలు

కర్నూలు(సెంట్రల్‌): కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్‌, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి.నిర్మల కుమారుడు డాక్టర్‌ కిరణ్‌ అంత్యక్రియలను వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం సంగినేనిపల్లెలో నిర్వహించనున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్‌ హోసేలో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్న కిరణ్‌ గుండెపోటుతో అక్టోబర్‌ ఒకటో తేదీన మృతిచెందారు. అతను మరణించిన పదకొండు రోజుకు తల్లిదండ్రులు ఈ విషయం తెలిసింది. సోమవారం ఉదయం కిరణ్‌ భౌతికకాయం కర్నూలుకు చేరుకుంటుందని, సుందరయ్య భవన్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే సతీమణి పి.నిర్మల సొంతూరు అయిన వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం సంగినేనిపల్లెలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

ఓర్వకల్లు: కర్నూలు – నంద్యాల జాతీయ రహదారిపై కాల్వబుగ్గ సమీపంలోని కాకతీయ హై స్కూల్‌ ఎదురుగా శనివారం అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హుసేనాపురం గ్రామానికి చెందిన డి.రంగస్వామి అలియాస్‌ రంజిత్‌ (27) స్థానికంగా సెల్‌ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. శనివారం రాత్రి కాల్వబుగ్గలోని ఓ కస్టమర్‌కు సెల్‌ఫోన్‌ ఇచ్చి బైక్‌పై తిరిగివచ్చే క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య సుస్మిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మద్యం లారీ బోల్తా..

సి.బెళగల్‌: మద్యం సీసాల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో భారీగా మద్యం సీసాలు ధ్వంసమయ్యాయి. వివరాలు.. ఆదివారం కర్నూలు నుంచి మద్యం సీసాల లోడుతో సి.బెళగల్‌కు వస్తున్న లారీ..గ్రామ శివారులోని అర్లవాగు దగ్గరకు రాగానే టైరు పేలి అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ప్రమాదంలో దాదాపు రూ.4 లక్షల విలువజేసే మద్యం సీసాలు ధ్వంసమైనట్లు బాధితులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement