కొలిమిగుండ్ల: మీర్జాపురం గ్రామంలో ఓ వయుకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన తలారి మురళి (32)కి భార్య కవిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గ్రామ శివార్లలోని వేస్టే మేనేజ్మెంట్ ప్లాంట్లో పని చేస్తుంటాడు. ఆదివారం ఉదయం ఇంటి సమీపంలో ఉన్న పశువుల కొట్టం శుభ్రం చేసేందుకు వెళ్తుండగా విద్యుత్ తీగ గొంతుకు తగిలి విద్యుదాఘాతంతో గురై తీగపైనే పడిపోయాడు. కొద్ది సేపటి తర్వాత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీగను తప్పించి వెంటనే కొలిమిగుండ్లలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. కుమారుడు మృతితో తండ్రి రాముడు, కుటుంబీకులు రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.


