ఎన్‌ఎస్‌టీఆర్‌లో పులుల వివరాలు
● నల్లమల రారాజు పెద్దపులి ● సంతానోత్పత్తిపై ఆడపులికి స్పష్టమైన అవగాహన ● 2024 – 25 లెక్కల ప్రకారం ఎన్‌ఎస్‌టీఆర్‌లో 87 పులులు ● నేడు అంతర్జాతీయ పెద్దపులుల దినోత్సవం
సంతానం సంరక్షణ బాధ్యత ఆడపులిదే
పర్యావరణ సంరక్షణలో పెద్ద పులికి ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలిసిన విషయమే. కాగా పెద్దపులి అంతరించే దశ నుంచి క్రమేపీ ఎదుగుతున్న క్రమంలో ప్రధాన బాధ్యత వహిస్తున్న ఆడపులికి పునరుత్పత్తి అంశాలపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. తన సంతానం బలంగా ఆరోగ్యంగా ఉండాలన్న ఆకాంక్ష ఆడపులిలో కచ్చితంగా ఉంటుంది. ఒక మగ పెద్దపులి 400 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని తన నివాస ప్రాంతంగా (టెరటరీ) ప్రకటించుకుంటుంది. ఆ ప్రాంతంలో సుమారు 6 ఆడపులులు కూడా తమ టెరటరీని నిర్ణయించుకుంటాయి. గర్భం ధరించడానికి మగ పులితో జత కట్టడానికి ఈ ఆడపులుల మధ్య కూడా పోటీ ఉంటుంది. ఇందుకోసం అవి కూడా ప్రాణాంతక దాడులు చేసుకుంటాయి. పులి ఒక కాన్పులో సాధారణంగా 2 నుంచి 4 కూనలకు జన్మనిస్తుంది. అరుదుగా 7 వరకు కూడా ఉండవచ్చు. రేచులు (అడవికుక్కలు) పులికూనల పాలిట ప్రధాన శత్రువులుగా ఉంటాయి. వాటి నుంచి కూడా ఆడ పులి తన కూనలను రక్షించుకోవాల్సింటుంది. తన పిల్లల సంరక్షణ బాధ్యతను గుర్తెరిగి తన కూనలు పెరిగి వేటకు సిద్ధమయ్యే వరకు అవి తిరిగి గర్భం దాల్చవు. ఆడపులి తొలి సంతానంలో పుట్టిన పిల్లలు సహజంగా అన్ని బతకవు, రెండోసారి గర్భంలో 50 శాతం, ఆపై జన్మించిన కూనల్లో 90 శాతం బతుకుతాయి. ఇదంతా ఆడపులి పిల్లలను కాపాడుకునే నైపుణ్య సాధించడంలో భాగంగానే జరుగుతుంది.
స్థానం కోసం పోరాటం..
మగ పెద్దపులి తను ఒక టెరిటరీని రక్షించుకోవడంలో ఇతర పులులతో నిరంతరం పోరాటం చేయాల్సి వస్తుంది. ఈ పోరాటంలో ఓడిపోతే మరణం తప్పదు... లేదంటి తన స్థానం గెలిచిన పులికి అప్పగించి మౌనంగా మరో చోటుకు వెళ్లాల్సిందే. ఇటీవల ఒక పెద్దపులి తెలంగాణాలోని అమ్రాబాద్ అభయారణ్యంలో తన స్థావరం వీడి పోయి కృష్ణా నదిని దాటి రాజీవ్ గాంధీ అభయారణ్యం (ఎన్‌ఎస్‌టీఆర్)లోకి వచ్చింది. అక్కడ దానికి చోటు లభించక పోవడంతో మెల్లగా గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణి అభయారణ్యంలోకి వచ్చింది. అక్కడ స్థిర పడక పోతే లంక మలకు వెళ్లాల్సిందే
మొదటి రోజు రక్తం.. రెండో రోజు గుండె, కాలేయం..
పెద్దపులికి అంత సులభంగా ఆహారం లభించదు. అడవిలో పెద్దపులికంటే మిగతా ఆహార జంతువులన్నీ కూడా వేగంగా పరిగెత్తుతాయి. అందుకే పెద్దపులికి ఐదారు ప్రయత్నాలకు ఒకసారి మాత్రమే ఫలితం దక్కుతుంది. ఇది సరాసరి 7 రోజులకో వేటగా ఉంటుంది. పెద్దపులి తన ఆహారాన్ని తీసుకోవడంలో క్రమ పద్ధతిని పాటిస్తుంది. తొలుత ఆహార జంతువు మెడను కొరికి చంపే పులి మొదట రక్తాన్ని స్వీకరిస్తుంది. అందుకే రక్తం ఎక్కువగా లభించే ఉదర ప్రాంతంపై కొరికి రక్తంతో కూడిన మాంసాన్ని తీసుకుంటుంది. రెండవ రోజు సున్నితమైన అవయవాలైన కాలేయం, గుండే, ఉపిరి తిత్తులను తింటుంది. మూడో రోజు జంతువు కటి భాగంలోని మాంసాన్ని నాలుగోరోజు తొడ మాంసాన్ని తింటుంది. ఆపై మొత్తం మాంసం మెత్తబడి పోతుంది కాబట్టి రెండుమూడు రోజులలో తన వేట మాంసం ఆసాంతం తినేస్తుంది. పులి వేట ఎంత కష్టతరమో వేట మాంసాన్ని వారం రోజులు కాపాడుకోవడం కూడా అంతే కష్టం. చిరుత పులులు చెట్లపై చంపిన జంతువును దాచుకుంటాయి. కాని పులి చెట్టు ఎక్కలేదు కాబట్టి పొదల్లో దాచి పెట్టుకుంటుంది. పెద్దపులి రోజు 20 గంటలు నిద్రావస్తలోనే ఉంటుంది. కేవలం నాలుగు గంటలపాటు మాత్రమే ఆహారం కోసం వెతుకుతుంది. అలాగే వేట దొరికిన తరువాత వారం రోజులు తినడానికి ఉపయోగించుకునే పులి ఆ తరువాత రెండు పూర్తి రోజులు నిద్రలో గడుపుతుంది.
సంవత్సరం సంఖ్య
2014 – 15 37
2015 – 16 40
2016 – 17 46
2017 – 18 46
2018 – 19 47
2019 – 20 63
2020 – 21 70
2022 – 23 78
2024 – 25 87
2026 – పులుల అంచనా పూర్తి కాలేదు
అందంలోనూ ... బలంలోనూ పెద్ద పులికి సాటిరాగల మరో జంతువు భూమిపై ఏదీ కనిపించదు. అది నడుస్తుంటే రాజసం తొణికిసలాడుతుంది. అంతటి అపురూపమైన జంతువును సంరక్షించేందుకు అటవీ శాఖ ఎన్నో చర్యలు చేపట్టింది. నేడు ఇంటర్నేషనల్ టైగర్‌డే సందర్భంగా పెద్ద పులుల విశేషాలు ఇలా.. – ఆత్మకూరురూరల్


