34 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు
ఒకరు సెలవులో వెళ్లగా ఖాళీగా ఉంటున్న విద్యార్థులు
ఉయ్యాలవాడ: భావి భారత పౌరులను తీర్చి దిద్దాల్సిన బడులను ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ఇందుకు నిదర్శనం మండలంలోని పెద్దయమ్మనూరు ప్రాథమికోన్నత పాఠశాల. ఈ బడిలో 1 నుంచి 7వ తరగతి వరకు 34 మంది విద్యార్థులు ఉండగా, ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం వీరిద్దరిలో మాధవి అనే టీచర్ సెలవులో వెళ్లగా మరో ఉపాధ్యాయురాలు (హెచ్‌ఎం) రమణమ్మ వరండాలో 1, 2, 3, 4 తరగతుల విద్యార్థులకు బోధన చేస్తూ వుంది. 5, 6, 7 తరగతుల విద్యార్థులు ఒకే గదిలో ఖాళీగా ఉన్నారు. ఉన్న ఇద్దరు టీచర్లలో ఒకరు సెలవుపై వెళ్తే బోధన కుంటు పడుతోంది. దీంతో విద్యార్థులు చదువులో వెనుకబడే ప్రమాదం ఉంది. అల్లూరు ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 8వ తరగతి వరకు 49 మంది విద్యార్థులు వున్నారు. ఈ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు వున్నారు. ఒక ఉపాధ్యాయ పోస్టు ఖాళీగా వుంది. ఉపాధ్యాయుల కొరతపై ఎంఈఓ వీరప్రతాప్‌రెడ్డిని వివరణ కోరగా.. ఖాళీల వివరాలను డీఈఓ దృష్టికి తీసుకెళ్తామన్నారు.


