మొక్కుబడిగా పీటీఎం సమావేశాలు
కర్నూలు సిటీ: పాఠశాల విద్యలో మార్పుల పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న హడావుడికి ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. వేసవి సెలవులు ముగిసి గత నెల 12న స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. ఈ రోజుకూ విద్యార్థులకు అవసరమైన కిట్లు పూర్తి స్థాయిలో అందని పరిస్థితి. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో పీటీఎం(పెరెంట్స్, టీచర్స్ మీటింగ్) పేరుతో సమావేశాలు నిర్వహించారు. సమావేశాల నిర్వహణకు ఒక రోజు ముందు అత్తెసరు నిధులు జమ చేశారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండే స్కూళ్లకు చెందిన హెచ్‌ఎంలు ఆ నిధులు సరిపోక సమావేశాలను మమ అనిపించారు. మౌలిక సదుపాయాల పనులు నిలిచిపోవడం, తల్లికి వందనం రాకపోవడం, టీచర్లు లేకపోవడంపై పశ్చిమ ప్రాంత స్కూళ్ల హెచ్‌ఎంలను పెరెంట్స్ ప్రశ్నించారు. పిల్లల సామర్థ్యంపై టీచర్ అంచనా వేసి లోటు పాట్లను పెరెంట్స్‌కు తెలియజేయడంతో పాటు ఆప్యాయతను పంచాల్సిన సమావేశంలో ఎక్కడా ఆ ఊసేలేకుండా పోయింది.
పీటీఎం సమావేశాల్లో టీడీపీ నేతలు
ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడులు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో పోలీసుల బందోబస్తు మధ్యనే సమావేశాలు నిర్వహించారు. అయితే చాలా చోట్ల వేదికలపై ఎలాంటి నామినేటెడ్, ప్రొటోకాల్ పదవులు లేని వారిని సైతం కూర్చోబెట్టి విద్యాశాఖ అధికారులు ప్రసంగాలు ఇప్పించారు. మరికొన్ని చోట్ల స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ప్రతినిధులు లేకుండానే సమావేశాలు నిర్వహించారు.
● ఆదోనిలోని నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్‌లో జరిగిన పీటీఎం సమావేశంలో టీడీపీ జిల్లా అద్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ పాల్గొన్నారు. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఢిల్లీలో విద్యార్థులపై జరుగుతున్న దాడులు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. సమాధానం చెప్పక ముందే విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు గేటు బయటకు గెంటేశారు. పోలీసులకు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.
● పత్తికొండ నియోజకవర్గంలోని రామలింగాయపల్లెలో జరిగిన పీటీఎం సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు నిరసన తెలిపారు. పత్తికొండ జూనియర్ కాలేజీలు, ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన పీటీఎం సమావేశాలను విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు.
● కర్నూలు నగరంలోని ప్రభుత్వ ఉన్నత(టౌన్ మోడల్) హైస్కూల్‌లో జరిగిన పీటీఎం సమావేశంలో ఎమ్మెల్సీ బి.టి నాయుడు హాజరయ్యారు. ఇదే సమయంలో విద్యా సంస్థల బంద్‌లో భాగంగా విద్యార్థి సంఘాల నాయకులు అక్కడి చేరుకొని ఢిల్లీ ఘటనలపై మీ ప్రభుత్వం ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. అయితే వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థులను బయటకు లాక్కెళ్లిపోయారు.
ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం
విద్యాసంస్థల బంద్‌లో భాగంగా
విద్యార్థుల ఆందోళన
వేదికలపై టీడీపీ నేతలను
కూర్చోబెట్టి ప్రసంగాలు


