ప్రజా వ్యతిరేకతతోనే సీఎం జిల్లా పర్యటనలు | - | Sakshi
Sakshi News home page

ప్రజా వ్యతిరేకతతోనే సీఎం జిల్లా పర్యటనలు

Jul 25 2026 12:29 AM | Updated on Jul 25 2026 12:29 AM

ఆస్పరి: ప్రజల్లో టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉండటంతోనే చంద్రబాబు జిల్లా పర్యటనలకు వస్తున్నాడని ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరుపాక్షి అన్నారు. సీఎం చంద్రబాబు పర్యటనలకు ఖర్చు చేసే వందల కోట్ల రూపాయలు ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగించాలన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ నెలలోనే నాలుగు పర్యటనలు చేసిన సీఎం ఒక్క సమస్యనైనా పరిష్కరించలేకపోయాడన్నారు. శనివారం ఆస్పరిలో సీఎం చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ ఎమ్మెల్యే శుక్రవారం ఆస్పరిలోని అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న సమయంలో అనుమతి లేదని పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఎమ్మెల్యే సమస్యలు చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదా అని ప్రశ్నించారు. కొద్దిసేపు పోలీసులతో ఎమ్మెల్యే వాగ్వాదం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గంలోని గ్రామాలలో మంచినీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించుకునే నాథుడే లేరన్నారు. ఆస్పరి మండలంలోని గ్రామాల్లో నెలకోసారి కొళాయిలు ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడచినా నగరడోణ, వేదావతి ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్నారు. ఆస్పరిలో ఓ చిన్న కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ బసవరాజు, జెడ్పీటీసీ దొరబాబు, పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement