వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీ
ఆదోని: గంగమ్మ డెత్ మిస్టరీని పోలీసులు ‘దాచిపెడుతున్నట్లు’గానే కనిపిస్తోంది. రెండు నెలల క్రితం కౌతాళం మండలం బదినేహాళ్ గ్రామానికి చెందిన మాల గంగమ్మ కస్టోడియల్ డెత్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో నిజానిజాలను ప్రజల ముందుంచేందుకు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో లీగల్ సెల్ నిజనిర్ధారణ కమిటీ మాజీ మంత్రి శైలజానాథ్ ఆధ్వర్యంలో శుక్రవారం బదినేహాళు గ్రామానికి చేరుకుంది. స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి, స్టేట్ లీగల్ సెల్ అధికార ప్రతినిధి షౌకత్ తబ్రేజ్, లీగల్ సెల్ కార్యదర్శి జీవన్‌సింగ్, ఎంఎల్‌సీ డాక్టర్ మధుసూదన్, తదితరులు ఆయన వెంట ఉన్నారు. అయితే విషయం ముందుగానే తెలుసుకున్న పోలీసులు గంగమ్మకు సంబంధించిన కుటుంబ సభ్యులను భయపెట్టి ఇంటి నుంచి పంపేసినట్లు తెలుస్తోంది. ఒక గంట క్రితం వరకు వారంతా ఇంట్లోనే ఉన్నారని, ఇంతలోనే కనిపించకుండా పోవడం ఆశ్చర్యంగా ఉందని గ్రామస్తులే చర్చించుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ గంగమ్మ లాకప్ డెత్ వెనుక వాస్తవాలను వెలికితీయాలన్నదే తమ ఉద్దేశమన్నారు. గంగ మ్మ కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందన్నారు. స్టేట్ లీగల్ సెల్ అధికార ప్రతినిధి షౌకత్ తబ్రేజ్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ చెప్పినట్లు తప్పు చేసిన వాళ్లు సప్త సముద్రాల అవతల దాగున్నా వదలబోమన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు.
మాజీ మంత్రి శైలజానాథ్ ఆధ్వర్యంలో
బదినేహాలుకు నాయకులు
కనిపించని గంగమ్మ కుటుంబ సభ్యులు
పోలీసులు భయపెట్టి ఉంటారనే చర్చ


