కర్నూలు(టౌన్): వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా బి. మునిస్వామి నియమితులయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదోని అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బి. మునిస్వామికి బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
డాక్యుమెంట్ల తయారీకి పీడీఈ కౌంటర్లు
కర్నూలు(సెంట్రల్): జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకు ఇబ్బంది లేకుండా పబ్లిక్ డేటా ఎంట్రీ కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా రిజిస్ట్రార్ వై.బజారి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పీడీఈ కౌంటర్ల ద్వారా ప్రజలు డాక్యుమెంట్లను తయారు చేయించుకొని రిజిస్ట్రేషన్‌లు చేసుకోవచ్చన్నారు. డాక్యుమెంట్ రైటర్లు సమ్మెలో ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా పీడీఈ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
పాత సేవలతో
‘కొత్త సంజీవని’
● పైలట్ ప్రాజెక్టుగా
ఆస్పరి పీహెచ్‌సీ ఎంపిక
● నేడు లాంఛనంగా ప్రారంభించనున్న
ముఖ్యమంత్రి
కర్నూలు(హాస్పిటల్): ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే వైద్యసేవలను డిజిటలైజేషన్ చేసే విధంగా తీసుకుంటున్న చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సంజీవని అని పేరు పెట్టింది. ఇప్పటికే చిత్తూరు జిల్లా కుప్పం కేంద్రంగా ఈ పైలట్ ప్రాజెక్టు అమలవుతుండగా మన జిల్లాలోని ఆస్పరి పీహెచ్‌సీలో ఈ నెల 25న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ అభా కార్యక్రమం, టెలిమెడిసిన్‌లను కలిపితేనే సంజీవని అవుతుందని వైద్యుల్లోనూ చర్చ జరుగుతోంది. అయితే ఈ సంజీవని ప్రాజెక్టులో సాంకేతిక సహకారాన్ని టాటా సంస్థ అందిస్తోంది. పీహెచ్‌సీకి వచ్చే రోగుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, వారికి చేసిన వైద్యపరీక్షలు, ఇచ్చిన చికిత్స, మందులు తదితర వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఇందుకు సంబంధించి ప్రతి పీహెచ్‌సీలో కొందరు సిబ్బందిని నియమించనున్నారు.
బీఎడ్ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో గత మార్చి నెల నిర్వహించిన బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఫలితాలు https://rayalaseemauniversity.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. రెగ్యులర్ 4,404 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 3,186 మంది ఉత్తీర్ణత సాధించారన్నారురు. సప్లిమెంటరీకి సంబంధించి 977 మంది పరీక్షలు రాయగా 742 మంది ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు.


