ఆదోని అర్బన్: కర్ణాటక, తెలంగాణ, గోవా, ఆంధ్రప్రదేశ్‌లో బెట్టింగ్ చేయిస్తున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.6.73 లక్షలు నగదు, తొమ్మిది సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆదోని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం రాత్రి సీఐ రాజశేఖర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, హైదరాబాద్, బెంగళూరు, బళ్లారి, గోవా రాజధానిలో 18 రోజులపాటు వారి కోసం మకాం వేశామన్నారు. ప్రత్యేకంగా నిఘా ఉంచి ఆయా నగరాల్లో, జిల్లాల్లో ఆడుతూ, ఆడిస్తున్న తొమ్మిది మంది బెట్టింగ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మరి కొంతమంది ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు తెలియజేశారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న వారిని ఐపీఎల్ క్రికెట్ ముగించేలోపు అరెస్ట్ చేస్తామన్నారు.
యాప్‌లతో బెట్టింగ్..
బెట్టింగ్ నిర్వాహకులు ముందుగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటారని సీఐ తెలిపారు. ఆన్‌లైన్‌లో బెట్టింగ్ ఆడుకునేందుకు వారికి యాప్‌లు ఇస్తారన్నారు. నేరుగా వెళ్లి డబ్బు అందజేసి బెట్టింగ్‌లు ఆడే వ్యవస్థ ప్రస్తుతం లేదన్నారు. మొత్తం యాప్‌లోనే ప్రతి ఆటకు, బంతికి, వికెట్‌కు, గెలుపు, ఓటములకు బెట్టింగ్ ఉంటుందన్నారు. అమాయకులైన యువకులను బెట్టింగ్ మాయలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఎవరైనా బెట్టింగ్ ఆడుతున్నా, ఆడిస్తున్నా వారి సమాచారం తమకు అందిస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. ఎస్‌ఐ రామ్‌నాథ్, ఏఎస్‌ఐ నరసయ్య, సిబ్బంది సురేష్, మద్దిలేటి, మూర్తి తదితరులు పాల్గొన్నారు.
బెట్టింగ్ నిర్వాహకుల అరెస్ట్


