● రోడ్డు ప్రమాదంలో కర్నూలు వాసులు
ముగ్గురు మృతి
● 8 మందికి తీవ్ర గాయాలు
● ప్రమాదానికి నిద్రమత్తే కారణం
కర్నూలు: చిత్తూరు– తిరుపతి జాతీయ రహదారి చవటపల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు బళ్లారి చౌరస్తా ప్రాంతానికి చెందిన కృష్ణ (68), కోడళ్లు రమ్యశ్రీ (35), హేమలత (31) మృతిచెందారు. తమిళనాడు రాష్ట్రం తిరువన్నమలై జిల్లా అరుణాచలం శివపార్వతి స్వామివార్లను దర్శించుకుని తిరుగు ప్రయాణంలో తిరుమల శ్రీవారి దర్శనార్థం వెళ్తుండగా చవటపల్లి సమీపంలో ఆగి ఉన్న లారీని వీరు వెళ్తున్న జైలో కారు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. వాహనంలో కృష్ణ కుటుంబానికి చెందిన 11 మంది సభ్యులు ఉన్నారు. గురువారం సాయంత్రం కర్నూలు నుంచి అరుణాచలానికి చేరుకుని స్వామిఅమ్మవార్ల దర్శనం పూర్తి చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మృతిచెందిన కృష్ణ కుమారుడు మనోజ్ కుమార్ విశ్రాంతి లేకుండా వాహనం నడుపుతుండటంతో చవటపల్లి సమీపంలో నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో రోడ్డుపై ఆగివున్న లారీని ఢీకొట్టడంతో జైలో వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో మనోజ్ కుమార్, విజయలక్ష్మి, హేమంత్, చిన్నారులు లోహిత్ చార్మి, కళ్యాణ్, సుహస్రలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వారిని 108 అంబులెన్స్‌లో చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పూతలపట్టు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద సంఘటనను పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


