ఇంటర్ పరీక్షలు ప్రారంభం
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ థియరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి పరీక్ష కావడంతో విద్యార్థులు తమ హాల్ టికెట్లతో ఆలయాల్లో పూజలు చేయించుకుని తల్లిదండ్రుల ఆశీర్వాదంతో కేంద్రాల వద్దకు గంట ముందుగానే చేరుకున్నారు. ఉదయం 8.30 గంటల నుంచే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమనే నిబంధనతో విద్యార్థులు అప్రమత్తమయ్యారు. దూరప్రాంత విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ అధికారులు 17 రూట్లలో అదనపు బస్సు సౌకర్యం కల్పించారు. కేంద్రాల దగ్గర ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 144 సెక్షన్‌లు అమలు చేశారు. మొదటి సంవత్సం జనరల్ విభాగం విద్యార్థులు 26,925 మంది ఉండగా.. 26,102 మంది హాజరయ్యారు. ఆర్‌ఐఓ జి.లాలెప్పతో పాటు స్పెషల్ అబ్జర్వర్ ఎం.నాగమణి, డీఈసీ కమిటీ, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఆదోనిలో ఓ సెంటర్‌కు విద్యార్థి నిర్దేశిత సమయం కంటే 10 నిమిషాలు ఆలస్యంగా, ఎమ్మిగనూరులోని ఓ సెంటర్‌లో పరీక్ష మొదలయ్యాక 15 నిమిషాలు ఆలస్యంగా రావడంతో కేంద్రంలోకి అనుమతించకపోవడం గమనార్హం.
స్థలం విషయంలో ఘర్షణ
ఆదోని రూరల్: మండలంలోని సలకలకండ గ్రామంలో స్థలం విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరగడంతో 8 మందిపై కేసు నమోదు చేసినట్లు తాలూకా ఎస్‌ఐ రామాంజనేయులు సోమవారం తెలిపారు. స్థలం వ్యవహారం కోర్టులో ఉండగా సోమవారం సాయంత్రం పరస్పరం దాడులకు పాల్పడుతుండటంతో వారిని తాలూకా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గుర్రం రామాంజనేయులు అనే వ్యక్తి వర్గానికి చెందిన ఆరుగురిపై, ఈరన్న వర్గానికి చెందిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.


