రాఘవేంద్ర స్వామికి తిరుమల పట్టువస్త్రాలు
మంత్రాలయం: రాఘవేంద్రస్వామి మఠంలో గురు వైభవోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో వేకువజామున సుప్రభాత సేవతో పూజోత్సవాలు ప్రారంభం గావించారు. ఉదయం రాఘవేంద్రుల మూల బృందావనానికి ప్రత్యేక అభిషేకం, పుష్పాఅర్చనలు, విశేషాలంకరణలు చేపట్టారు. అనంతరం పూజా మందిరంలో రాములోరి సంస్థాన పూజ నిర్వహించారు. రాఘవేంద్రుల జన్మదినోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. గురువారం రాఘవేంద్రస్వామి జన్మదిన వేడుక చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ సూపరింటెండెంట్ గురురాజాచార్ ఆధ్వర్యంలో పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీమఠం మహాద్వారం నుంచి సంప్రదాయకంగా శ్రీ మఠం అధికారులు స్వాగతం పలికారు. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఎదురుగుండా వెళ్లి శాస్త్రోక్తంగా పట్టువస్త్రాలు తలపై మోసుకొని వచ్చి రాఘవేంద్రస్వామి చెంతకు చేర్చారు. పట్టు వస్త్రాలను రాఘవేంద్రుల బృందావనం చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. కేంద్రమంత్రి కుమారస్వామి టీటీడీ తెచ్చిన పట్టువస్త్రాల కార్యక్రమంలో ముఖ్యఅతిఽథిగా పాల్గొన్నారు. అనంతరం శ్రీమఠం ప్రాంగణంలో టీటీడీ సూపరింటెండెంట్ గురురాజాచార్‌ను రాఘవేంద్రుల జ్ఞాపిక, శేషవస్త్రం, ఫల మంత్రాక్షింతలతో పీఠాధిపతి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వేంకన్న క్షేత్రానికి, శ్రీమఠానికి ఉన్న ఆనవాయితీ బంధాన్ని భక్తులకు పీఠాధిపతి ప్రవచించారు. ఈ వేడుక భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీ మఠం ప్రాంగణంలో 2000 మంది తారతాముక్త భజన పారాయణ మండలి వారు భజన కీర్తనలు చేశారు. ఏఏఓ మాధవశెట్టి, శ్రీ మఠం మేనేజర్లు ఎస్.కే.శ్రీనివాసరావు, వెంకటేష్‌జోషి, శ్రీపతిచార్, సురేష్ కోనాపూర్, అనంతాపురానిక్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజచార్, సీఐ రామాంజులు పాల్గొన్నారు.


