సీఐ విక్రమ సింహపై కేసు నమోదు చేయాలి
● ఎస్పీ కార్యాలయం ఎదుట
న్యాయవాదులు రాస్తారోకో
కర్నూలు: ఓ కేసు విషయంలో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన న్యాయవాది పవన్‌కుమార్‌పై దాడి చేసి భయపెట్టిన కర్నూలు నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ విక్రమసింహపై చట్టప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కర్నూలులో సోమవారం ఉదయం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు జిల్లా కోర్టు నుంచి ఎస్పీ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అక్కడ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. సీఐ విక్రమసింహకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాలుగు వైపులా ట్రాఫిక్ స్తంభించిపోయి వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. స్టేషన్‌కు వెళ్లే న్యాయవాదుల పట్ల సీఐ విక్రమసింహ అమర్యాదగా ప్రవర్తిస్తూ పోలీసు జులుం ప్రదర్శిస్తున్నాడని ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు ఆరోపించారు. సీఐపై కేసు నమోదు చేసేవరకు ఆందోళన ఆగబోదని న్యాయవాదులు పేర్కొన్నారు. జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరినాథ్ చౌదరి, ప్రధానకార్యదర్శి వెంకటేశ్వర్లు, సీనియర్ న్యాయవాదులు వై.జయరాజు, సువర్ణ రెడ్డి, శ్రీనివాసన్, చంద్రుడు తదితరులు మాట్లాడుతూ.. ప్రజల కోసం పనిచేసే న్యాయవాదుల పట్ల సీఐ విక్రమసింహ దురుసు ప్రవర్తనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి సుమోటోగా కేసు నమోదు చేసి సస్పెండ్ చేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
సీఐను తక్షణమే సస్పెండ్ చేయాలి: ఐఏఎల్
లాయర్ అంటే కోర్టు ఆఫీసర్ అనే విషయం మర్చిపోయి నాలుగో పట్టణ సీఐ విక్రమ సింహ న్యాయవాది పవన్‌కుమార్‌పై దారుణంగా భౌతిక దాడి చేసి కొట్టడం హీనమైన చర్య అని ఐఏఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బీఎస్ రవికాంత్ ప్రసాద్ ఖండించారు. పోలీసులు, న్యాయవాదులు సమన్వయంతో పనిచేయాల్సింది పోయి దౌర్జన్యంగా న్యాయవాదిపై వ్యవహరించడం తగదన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. విషయం తెలిసిన వెంటనే అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు శేషయ్య, నాగరాజరావు తదితరులు అక్కడికి చేరుకుని న్యాయవాదులకు సర్దిచెప్పారు. రెండు రోజులు సమయమిస్తే సంఘటనపై విచారణ జరిపి తగు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా న్యాయవాదులకు ఏఎస్పీ హామీ ఇచ్చారు. ఐఏఎల్ నాయకులు కుమార్, లక్ష్మణ్, వెంకటస్వామి, చంద్రుడు, ఓంకార్ పాల్గొన్నారు.


