అర్హతలేని వారితో వైద్యపరీక్షలు
● స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో దారుణం
కర్నూలు(హాస్పిటల్): ల్యాబ్‌టెక్నీషియన్ ద్వారా చేయాల్సిన వైద్యపరీక్షలు(డయాగ్నోస్టిక్ టెస్ట్) అర్హతలేని జనరల్ డ్యూటీ అటెండర్‌తో చేయిస్తున్నారు. ఇదేదో ప్రైవేటు ల్యాబ్‌లో జరుగుతున్న తంతు కాదు. కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఏడాదిన్నరగా ఈ దారుణం కొనసాగుతోంది. ఈ కారణంగా ఏ పరీక్షలు సరైనవో, ఏవి కావో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ చేయడం కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే నోటిఫికేషన్ జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఏడాదికి మెరిట్‌లిస్ట్‌లు విడుదల చేశారు. కానీ ఇప్పటి వరకు ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేయలేదు. దీనికి మెడికల్ కాలేజీ అధికారుల నిర్లక్ష్యమో లేక ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో నిలిపివేశారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయమై అభ్యర్థులు పలుమార్లు స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఇదే సమయంలో అర్హతలేని వారు చేసే రక్తపరీక్షల వల్ల నివేదికలు తప్పుల తడకగా వస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో తాజాగా కొందరు అభ్యర్థులు తమ ఆవేదనను సోషల్ మీడియా వేదికగా చేసిన మెసేజ్ వైరల్ అవుతోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు తమ ఆవేదన అర్థం చేసుకుని పోస్టులు భర్తీ చేయాలని వారు కోరుతున్నారు. కాగా ఈ విషయమై కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ వివరణ ఇస్తూ సిబ్బంది కొరతతో ఆలస్యమైందని, మరో వారం రోజుల్లో పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు.


