మూగజీవాలకూ.. మందుల్లేవ్‌! | - | Sakshi
Sakshi News home page

మూగజీవాలకూ.. మందుల్లేవ్‌!

Jan 19 2026 4:35 AM | Updated on Jan 19 2026 4:35 AM

మూగజీవాలకూ.. మందుల్లేవ్‌!

మూగజీవాలకూ.. మందుల్లేవ్‌!

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని

పశుసంపద వివరాలు

కర్నూలు(అగ్రికల్చర్‌): పశువైద్యానికి ఏడాదిగా మందులు సరఫరా చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. అత్యవసర వైద్యం అందించే సంచార పశువైద్య కేంద్రాలను నామమాత్రానికి పరిమితం చేసింది. పశువైద్యానికి మందుల్లేవని, వెంటనే సరఫరా చేయాలని పశువైద్యులు కోరుతున్నా.. పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. మొత్తంగా పశువైద్యం పడకేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజల దృష్టి మరల్చేందుకు..

నోరులేని మూగజీవులకు వైద్య సేవలు అందించడంలో విఫలమైందనే అసంతృప్తి చాపకింది నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చేందుకు ఉచిత పశువైద్య శిబిరాలంటూ హడావుడి చేస్తోంది. 2025–26 సంవత్సరానికి సంబంధించి ఇంతవరకు మందులు సరఫరా చేసిన దాఖలాలే లేవు. మందులు ఇవ్వడంలో చేతులేత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పశువైద్య శిబిరాలు అంటూ ప్రకటించింది. పశువైద్య శిబిరాలు నిర్వహించాలంటే అనేక రకాల మందులు అవసరం. కేవలం నట్టల నివారణ మందులు మినహా ఇతరత్రా మందులు లేవు. మందులే లేనపుడు ఉచిత పశువైద్య శిబిరాల నిర్వహణ ఎలా సాధ్యమవుతుందని పశుసంవర్ధక శాఖ అధికారులే పేర్కొంటున్నారు.

రోజుకొక పంచాయతీ ప్రకారం

ఈ నెల 19 నుంచి 31 వరకు పంచాయతీల వారీగా పశువైద్య శిబిరాలు నిర్వహించడానికి పశుసంవర్ధక శాఖ చర్యలు తీసుకుంది. కర్నూలు జిల్లాలో 484, నంద్యాల జిల్లాలో 489 పంచాయతీల్లో పశువైద్య శిబిరాలు నిర్వహించనుంది. పశువైద్య శిబిరాలను పర్యవేక్షించేందుకు పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్‌లో జాయింట్‌ డైరెక్టర్‌ అయిన డాక్టర్‌ దుర్గాప్రసన్నబాబు ఉమ్మడి జిల్లాకు స్పెషల్‌ అధికారిగా నియమితులయ్యారు. పశువైద్యశాలలు కర్నూలు జిల్లాలో 66, నంద్యాల జిల్లాలో 74 ఉన్నాయి. ప్రతి పశువైద్యశాల పరిధిలోని రోజు ఒక పంచాయతీ ప్రకారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యశిబిరాలు నిర్వహిస్తారు.

సరఫరా కాని మందులు

ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహించాలంటే అనేక రకాల మందులు అవసరం. కనీసం యాంటిబయాటిక్స్‌, పెయిన్‌ కిల్లర్స్‌, లివర్‌ టానిక్‌లు, ఆవులు, గేదెలు ఎదకు రావడానికి అవసరమైన మందులు ఉండాలి. ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉంది. గొర్రెలు, మేకలకు పీపీఆర్‌, హెచ్‌ఎస్‌ టీకాలు వేయాల్సి ఉంది. ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఈ మందులేవి సరఫరా చేయలేదు. వైద్య శిబిరాల్లో గర్భకోశ వ్యాధులకు చికిత్స చేస్తున్నట్లు పశు సంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే మందులు మాత్రం సరఫరా కాలేదు. గొర్రెలు, మేకలు, దూడలు, పెద్ద పశువులకు కేవలం నట్టల నివారణ మందులు మాత్రమే సరఫరా అయ్యాయి. నట్టల నివారణ మందులతో పశువైద్య శిబిరాలు నిర్వహించడం ఎలా సాద్యమవుతుందని వెటర్నరీ అసిస్టెంటు సర్జన్స్‌, అసిస్టెంటు డైరెక్టర్స్‌ వాపోతున్నారు.

దయనీయం.. పశువైద్యం

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పశువైద్యం డీలాపడింది. పశువైద్యానికి అవసరమైన మందులు సరఫరా చేయడంలో పూర్తిగా చేతులెత్తేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలల్లో ముగియనుంది. ఈ సంవత్సరానికి సంబంధించి పశువైద్య శాలలకు మందులు సరఫరా కాలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రాలకు మందులు సరఫరా చేసేవారు. వెటర్నరీ అంబులెటరీ సర్వీస్‌లతో అత్యవసర వైద్యం అందుబాటులోకి వచ్చింది. 1962 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేస్తే క్షేత్రస్థాయికే వెళ్లి వైద్య సేవలు అందించేవారు. నియోజక వర్గాలవారీగా పశువ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. చంద్రబాబు ప్రభుత్వంలో సంచార పశువైద్యకేంద్రాలు నామమాత్రానికి పరిమితం అయ్యాయి. పశువ్యాధి నిర్ధారణ కేంద్రాలు మరుగునపడ్డాయి.

తెల్ల జాతి పశువులు 3,56,541

నల్ల జాతి పశువులు 4,20,882

గొర్రెలు 19,85,868

మేకలు 6,10,669

కోళ్లు 12,89,417

నేటి నుంచి ఉచిత పశువైద్య శిబిరాలు

మందులు సరఫరా చేయని

చంద్రబాబు ప్రభుత్వం

తూతూమంత్రానికే పరిమితమైన

సంచార పశువైద్యశాలలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement