ఈరన్నస్వామికి ప్రత్యేక పూజలు
కౌతాళం: మౌని అమావాస్య కావడంతో ఆదివారం ఉరుకుంద ఈరన్నస్వామి దేవాలయంలోప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామిని దర్శంచుకోవాడానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. లక్ష పుష్పార్చన పూజల్లో పాల్గొని భక్తిని చాటుకున్నారు. పిండివంటలు వండి స్వామికి నైవేద్యంగా సమర్పించారు. భక్తుల సౌకార్యర్థం ఆదోని, ఎమ్మిగనూరు, కర్ణాటకలోని రాయచూరు, శిరుగుప్ప ఆర్టీసీ డిపోలవారు ప్రత్యేక బస్సులను నడిపారు.
జాతీయ పోటీలకు బంటన్‌హాల్ విద్యార్థినులు
చిప్పగిరి: నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచి జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు బంటన్‌హాల్ గ్రామానికి చెందిన అమూల్య, నందిని ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పెద్దల ఆధ్వర్యంలో ఆదివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజల తరఫున రూ 70,000 నగదు ప్రోత్సాహం అందించారు. మారుమూల ప్రాతంలో పుట్టి జాతీయ స్థాయికి ఎంపిక కావడం పై వారి తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు హర్ష వ్యక్తం చేశారు. ఈ విద్యార్థినులు గుంతకల్లు జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నారు. వీరిద్దరూ కవల పిల్లలు కావడం విశేషం.
కొలిమిగుండ్ల: సైబర్ నేరగాళ్లకు చిక్కిన ఓ యువకుడు బ్యాంక్ ఖాతాలో ఉన్న నగదును పోగొట్టుకున్న సంఘటన ఆదివారం కల్వటాలలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడికి వాట్సాప్‌లో లింక్ రావడంతో క్లిక్ చేశాడు. దీంతో సైబర్ నేరగాళ్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతని బ్యాంక్ అకౌంట్ నుంచి మొదటగా రూ.50 వేలు, రెండవ సారి రూ.18 వేలు మొత్తం కలిపి రూ.68 వేలు లూటీ చేశారు. సెల్‌ఫోన్‌కు బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అయినట్లు సమాచారం రావడంతో మోసపోయానని లబోదిబోమన్నాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సంక్రాంతి సందర్భంగా సైబర్ కేటుగాళ్లు వాట్సాప్, సోషల్ మీడియాలో లింక్‌ను పెట్టారు. లింక్‌ను క్లిక్ చేస్తే తక్షణమే రూ.5 వేలు జమ అవుతాయని పెట్టారు. ఇలాంటి వాటిని చూసి చాలా మంది జనం మోసపోతూనే ఉన్నారు.


