శ్రీశైలేశునికి పుష్పోత్సవం
● అశ్వవాహనంపై విహరించిన
ఆదిదంపతులు
● శ్రీశైలంలో ముగిసిన సంక్రాంతి
బ్రహ్మోత్సవాలు
అశ్వవాహనాధీశులైన పార్వతీ పరమేశ్వరుడికి ఆలయ ఉత్సవం నిర్వహిస్తున్న దృశ్యం
స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవ సేవ నిర్వహిస్తున్న పండితులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలంలో పార్వతీ సమేత మల్లికార్జున స్వామివారికి వైభవంగా పుష్పోత్సవాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాల చివరి రోజు స్వామి అమ్మవార్లు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామిఅమ్మవార్లకు శయనోత్సవం, ఏకాంతసేవ సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆయా ఉత్సవాలతో శ్రీగిరిలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. సంక్రాతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆదివారం స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఉత్సవాల ముగింపులో భాగంగా స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అశ్వవాహనసేవ నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన ఉత్సమూర్తులను అశ్వవాహనంపై ఉంచి ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు ప్రత్యేక పూజాది హారతులిచ్చారు. అనంతరం అశ్వవాహనాధీశులైన స్వామి అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో ఆలయ ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవంలో కళాకారుల నృత్యాలు, విన్యాసాలు, డప్పు వాయిద్యాలు, కోలాటలు భక్తులను ఆకట్టుకున్నాయి. అశ్వవాహనంపై విహరించిన స్వామి అమ్మవార్లను పలువురు భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.
సంప్రదాయబద్ధంగా పుష్పోత్సవం,
శయనోత్సవం
సంక్రాంతి పర్వదినం రోజున నూతన వధూవరులైన పార్వతీ, మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా కాగడాలు, ఎర్రగులాబీలు, తెల్లగులాబీలు, పసుపు గులాబీలు, ఎర్రమందారం, తెల్లమందారం, ముద్దమందారం, నందివర్దనం, గరుడవర్దనం, కనకాంబారాలు, సుగంధాలు(లిల్లీపూలు), పసుపు చేమంతి, ఊదాచేమంతి, తెల్లచేమంతి, ఎర్రగన్నేరు, తెల్లగన్నేరు, దేవగన్నేరు, ముద్దగన్నేరు మొదలైన 20 రకాల పుష్పాలు, బిల్వం, మరువం మొదలైన పలు రకాల పత్రాలతో స్వామిఅమ్మవార్లకు విశేషంగా అర్చించారు. అలాగే అరటి, తెల్ల, నల్లద్రాక్ష, దానిమ్మ, కమల, యాపిల్, పైనాపిల్, జామ, ఖర్జూరం మొదలైన 11 రకాల ఫలాలు కూడా నివేదించారు. అనంత రం స్వామిఅమ్మవార్లకు ఏకాంతసేవ నిర్వహించి, శయనోత్సవం నిర్వహించారు. శయనోత్సవం కోసం ఆలయ ప్రాంగణంలోని స్వామిఅమ్మవార్ల శయన మందిరాన్ని విశేష పుష్పాలంకరణ చేశారు. ఆయా పూజా కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, దేవస్థాన ధర్మకకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
శ్రీశైలేశునికి పుష్పోత్సవం
శ్రీశైలేశునికి పుష్పోత్సవం


